Share News

CM Revanth Reddy: తెలంగాణకు జైపాన్‌

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:42 AM

హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఎన్‌టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.

CM Revanth Reddy: తెలంగాణకు జైపాన్‌

రాష్ట్రంలో జపాన్‌ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు

జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం

‘తెలంగాణ రైజింగ్‌’. ఈ రోజు తెలంగాణ.. జపాన్‌లో ఉదయిస్తోంది.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • రూ.10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు

  • రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా ఒప్పందం

  • 25 వేల జీపీయూలతో 400 మెగావాట్ల డేటా సెంటర్‌ నిర్మాణం

  • రూ.562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తోషిబా అనుబంధ కంపెనీ

  • హైదరాబాద్‌ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా

  • కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం

  • జపాన్‌ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‌’ బృందంతో రెండో రోజైన శుక్రవారం రూ.11,062 కోట్లతో పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఎన్‌టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే పేరొందిన ఎన్‌టీటీ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫస్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్క్స్‌ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్‌ నుంచి బోర్డు సభ్యుడు కెన్‌ కట్సుయామా, డైరెక్టర్‌ తడావోకి నిషిమురా, ఎన్టీటీ గ్లోబల్‌ డేటా సెంటర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలోక్‌ బాజ్‌పాయ్‌, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్‌ డేటా చైర్మన్‌ షరద్‌ సంఘీ త్రైపాక్షిక ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 400 మెగావాట్ల డాటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తారు. 25 వేల గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల (జీపీయూ)తో దేశంలోనే అత్యంత శక్తిమంతమైన ఏఐ సూపర్‌ కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలను సమకూరుస్తారు. ఏఐ- ఫస్ట్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తారు. దీనిని 500 మెగావాట్ల వరకు గ్రిడ్‌, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో నిర్వహిస్తారు. ఇక్కడ లిక్విడ్‌ ఇమర్షన్‌ వంటి అత్యాధునిక కూలింగ్‌ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఎన్టీటీ డాటా కంపెనీ ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది. ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్లో పేరొందిన ఈ కంపెనీ.. ప్రపంచంలోని టాప్‌ 3 డేటా సెంటర్‌ ప్రొవైడర్లలో ఒకటి. ఇందులో 50కిపైగా దేశాల్లో 1,93,000 మంది పని చేస్తున్నారు. పబ్లిక్‌ సర్వీసెస్‌, బీఎ్‌ఫఎ్‌సఐ, హెల్త్‌ కేర్‌, మా న్యుఫాక్చరింగ్‌, టెలికం వంటి రంగాలకు సేవలందిస్తుంది.


రూ.562 కోట్లతో తోషిబా పెట్టుబడులు

తోషిబా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (టీటీడీఐ) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌ సమక్షంలో తోషిబా కార్పొరేషన్‌ ఎనర్జీ బిజినెస్‌ డైరెక్టర్‌ హిరోషి కనెటా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీటీడీఐ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హిరోషి ఫురుటాలు విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం.. హైదరాబాద్‌ సమీపంలోని రుద్రారంలో సర్జ్‌ అరెస్టర్స్‌ తయారీ ఫ్యాక్టరీని టీటీడీఐ ఏర్పాటు చేస్తుంది. అలాగే, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌ గేర్‌ (జీఐఎస్‌) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే ఇక్కడున్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్‌ చేయనుంది. ఇందుకు కంపెనీ రూ.562కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్‌ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతోపాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఈసందర్భంగా టీటీడీఐ చైర్మన్‌ హిరోషి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆకట్టుకుంటున్నాయన్నారు.


రండి.. పెట్టుబడులు పెట్టండి: రేవంత్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జపాన్‌ పారిశ్రామిక, వ్యాపారవేత్తలను సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. టోక్యోలోని హోటల్‌ ఇంపీరియల్‌లో శుక్రవారం ఇండియా-జపాన్‌ ఎకనమిక్‌ పార్టనర్‌షిప్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలంగాణ రైజింగ్‌ బృందం వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికిపైగా జపాన్‌ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. రెండు పెట్టుబడులపై సంతకాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ‘‘జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్‌’. ఈరోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. టోక్యో గొప్ప నగరమని, ఇక్కడి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన ప్రతిభ, స్థిరమైన విధానాలను తమ ప్రభుత్వం అందిస్తుందని జపాన్‌ వ్యాపారవేత్తలకు హామీ ఇచ్చారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సింగిల్‌ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని, ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఏఐ సంబంధిత డిజిటల్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు.


భారత్‌, జపాన్‌ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని, అన్ని రంగాల్లో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు. ఏడబ్ల్యూఎస్‌, ఎస్‌టీటీ, టిల్‌మన్‌ హోల్డింగ్స్‌, సీటీఆ ర్‌ఎల్‌ఎస్‌ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్‌ ప్రాజెక్టుల సరసన ఎన్‌టీటీ క్లస్టర్‌తో దేశంలో ప్రముఖ డేటా సెంటర్‌ హబ్‌గా హైదరాబాద్‌ స్థానం మరింత బలపడిందని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి సీబీ జార్జ్‌ మాట్లాడుతూ.. భారత్‌-జపాన్‌ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను వివరించారు. తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెట్రో) బెంగళూరు డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుటానీ పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి నెట్‌ జీరో ఇండస్ట్రియల్‌ సిటీగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వేదికపై ప్రదర్శించారు. ఎలకా్ట్రనిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, టెక్స్‌టైల్స్‌, గ్రీన్‌ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్‌ వివరించారు. అనంతరం, తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైందని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, టోక్యోలోని సుమిద రివర్‌ ఫ్రం ట్‌ను తెలంగాణ ప్రతినిధి బృందం సందర్శించింది.


రెండ్రోజుల్లో రూ.12,062 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌ నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‌’ బృందం రెండ్రోజుల్లో రూ.12,062 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. మూడు కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దీంతో, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 03:42 AM