Warangal Gun Culture: ఏబీఎన్‌లో గన్ కల్చర్ కథనాలు.. పోలీసులు అలర్ట్
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:34 AM
రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరాన్ని సూరి గ్యాంగ్ అడ్డాగా మార్చుకున్నట్లు తెలిపారు.
వరంగల్: ఏబీఎన్‌లో ప్రసారం అయిన వరంగల్ గన్ కల్చర్ కథనాలు సంచలనం సృష్టించాయి. దీంతో గన్ కల్చర్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్ సూరిని ఇవాళ(శుక్రవారం) మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. కాగా, సూరి గ్యాంగ్‌పై ఏబీఎన్‌లో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ మేరకు పోలీసులు సూరి గురించి కూపీ లాగారు. సూరిపై హైదరాబాద్‌లో 39 కేసులు ఉన్నాయని, వాటిలో 3 పీడీ యాక్ట్‌లు కూడా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
అయితే.. గత నెల 5వ తేదీతో సూరి హైదరాబాద్ నగర బహిష్కరణ ముగిసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం భూపాలపల్లి, ములుగులో దందాలకు సూరి స్కెచ్ వేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో పెట్రోల్ బంకులో బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. గత నెల 18వ తేదీనే సూరిపై రాబరీ, డెకాయిట్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. అనంతరం సూరి దగ్గర ఉన్న గన్‌పై పోలీసులు ఆరా తీశారు. ఈ మేరకు సూరి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు వివరించారు. విచారణలో బీహార్ నుంచి సూరి గ్యాంగ్ ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్టు గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్లో రాచకొండ పోలీసులు బహిష్కరణ విధించగా నగరం వీడిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సూరి వరంగల్‌ను అడ్డాగా చేసుకుని అరాచకాలకు తెరలేపి అడ్డంగా దొరికిపోయాడు. సూరి గ్యాంగ్‌పై ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లలో మూడు హత్యలతో సహా పలు లైంగికదాడులు, దాడులు, దొంగతనాలు, ఆయుధాలతో సంచరించడం వంటి కేసులు ఉన్నాయి. దీంతో అతడిని ఏడు నెలల కింద నగరం నుంచి రాచకొండ పోలీసులు బహిష్కరించారు. తర్వాత అతడు వరంగల్ వెళ్లి భీమారం సమీపంలోని ఓ డాగ్ ఫామ్‌లో అడ్డా ఏర్పాటు చేసుకుని కొంతమందితో ముఠా నిర్వహిస్తూ.. దందాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సూరిని అరెస్ట్ చేసి వివరాల గురించి కూపీ లాగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం