Share News

Sub Registrar Sivashankar: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:36 AM

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్‌‌ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

Sub Registrar Sivashankar: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..
Sub Registrar Sivashankar

హైదరాబాద్, నవంబరు18(ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ (Vanasthalipuram Sub Registrar Sivashankar)పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. ఆయనపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేశ్ అనే సబ్ రిజిస్ట్రార్ అనిశాకు చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌‌కు సబ్ రిజిస్ట్రార్ ఇన్‌చార్జి‌గా బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. హయత్‌నగర్ మండలం సాహె‌బ్‌నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నంబరులో వివాదానికి కారణమైన ఓ పార్కు స్థలం ఉంది.


ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఉన్న లే అవుట్(అనధికారిక) ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. స్థానికులు వివిధ కోర్టులను ఆశ్రయించి అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్కు ఉన్న ప్రాంతానికి కూడా బై నంబరుతో కొందరు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయగా.. సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు.


పలు డాక్యుమెంట్లకు ఒకే ప్రాంతం ఫొటోలు చూపించినా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం, పార్కు స్థలం ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా సబ్‌రిజిస్ట్రార్ శివశంకర్‌ ఉదాసీనంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ శివశంకర్‌‌‌ తప్పు ఉందని విచారణలో గుర్తించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల నేపథ్యంలో కార్యాలయాల్లో ఉన్న లోపాలపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది మారకపోవడంపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National New

Updated Date - Nov 19 , 2025 | 11:55 AM