Share News

National Awards: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:59 PM

ఆరో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

National  Awards: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట
Telangana Wins National Water Awards

ఢిల్లీ, నవంబరు18(ఆంధ్రజ్యోతి): జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన ఆరో జాతీయ జల అవార్డులు (National Water Awards) - 2024లో జాతీయ స్థాయిలో తెలంగాణ తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం- 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,20,362 పనులని పూర్తిచేసింది.


జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఇవాళ (మంగళవారం) పురస్కారాలు ప్రదానం చేశారు. జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వం 100 అవార్డులను ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఒక పట్టణ స్థానిక సంస్థ, రెండు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రెండు పరిశ్రమలు, మూడు ఎన్‌జీఓలు, ఇద్దరు దాతలు, 14 మంది నోడల్‌ అధికారులు ఉన్నారు.


క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 వేల కృత్రిమ రీఛార్జి, స్టోరేజ్‌ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూఫ్‌టాప్‌ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేర్చారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు.


మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి రూ.2 కోట్లు, రెండో కేటగిరీలో కోటి రూపాయలు, మూడో కేటగిరీలో రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. జిల్లాల విభాగంలో కేటగిరీ-1 కింద దక్షిణ జోన్‌ నుంచి మూడు జిల్లాలను ఎంపిక చేయగా.. ఆ మూడింటినీ తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతి అందజేసింది. ఆదిలాబాద్‌, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు ఈ నగదు బహుమతిని సాధించాయి.


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఏరియాలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు.. హైదరాబాద్‌ మెట్రో కార్పొరేషన్‌ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు మున్సిపల్‌ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. రూ.2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకొంది. ఈ విభాగంలో కేటగిరీ-2లో వరంగల్‌, నిర్మల్‌, జనగామ, జిల్లాలు దక్షిణ జోన్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచి రూ.కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి.


కేటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ 1, 3 ర్యాంకుల్లో నిలిచి.. రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి సొంతం చేసుకున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్‌ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీశ్‌కు కూడా అవార్డు దక్కింది. ఈ మేరకు పౌర సంబంధాల అధికారి, తెలంగాణ సమాచార కేంద్రం న్యూఢిల్లీ ద్వారా ఈ ప్రకటన జారీ చేశారు.


అవార్డుల వివరాలివే..

డా.శ్రీజన, ఐఏఎస్, పీఆర్, ఆర్డీ కమిషనర్

కే.అశోక్ కుమార్ రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్

రాజర్షి షా, ఐఏఎస్, కలెక్టర్, ఆదిలాబాద్

జే.శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్, నల్గొండ

కుమార్ దీపక్, ఐఏఎస్, కలెక్టర్, మంచిర్యాల

డాక్టర్ సత్యశారద, ఐఏఎస్, కలెక్టర్, వరంగల్

అభిలాష అభినవ్, ఐఏఎస్, కలెక్టర్, నిర్మల్

రిజ్వాన్ భాషా షేక్, ఐఏఎస్, కలెక్టర్, జనగామ

జితేష్ వీ పాటిల్, ఐఏఎస్, భద్రాద్రి కొత్తగూడెం

బి.విజయేందిర, ఐఏఎస్, కలెక్టర్, మహబూబ్ నగర్.


ఇవి కూడా చదవండి...

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 02:23 PM