Old City Metro: వచ్చే నెలలోనే టెండర్లు?
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:03 AM
పాతబస్తీ మెట్రో కారిడార్ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు పాతబస్తీలో మెట్రో పిల్లర్ల పనులకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఆసక్తికరంగా మారింది.

ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్‌పై సర్కారు దృష్టి
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు
వడివడిగా సాగుతున్న హెచ్‌ఏఎంఎల్
డిజైనింగ్ సవరణలతో తగ్గిన 200 ఆస్తుల సేకరణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీ మెట్రో కారిడార్ (Old City Metro Corridor) పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు పాతబస్తీలో మెట్రో పిల్లర్ల పనులకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఆసక్తికరంగా మారింది. నగరంలో మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ మార్గానికి రూ.2,741 కోట్లను కేటాయించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌లో కొన్ని రోజుల క్రితం మార్పులు చేశారు.
తగ్గిన 200 ఆస్తులు..!
కారిడార్ నిర్మాణంలో తొలుత 1,100 ఆస్తులు ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. అయితే, కొన్ని రోజులుగా ఆస్తుల సేకరణలో పలుచోట్ల స్వల్ప సవరణలు చేసి 200 ఆస్తులను తగ్గించారు. అక్కన్నమాదన్న ఆలయం దాటిన తర్వాత ఎడమ వైపున అలైన్‌మెంట్‌ను కొద్దిగా సవరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే చార్మినార్, లాల్‌దర్వాజా మోడ్ వద్ద ఇంజనీరింగ్ డిజైన్‌ను మార్చడంతో ఆస్తులు తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం మొత్తం 900ఆస్తులను సేకరిస్తున్నామని, 7.5 కి.మీ. కారిడార్‌లో 20 మీటర్లకు ఒక పిల్లర్ ఉంటుందని, వయాడక్టు నిలిపే పిల్లర్ల మధ్య 25 మీటర్ల దూరం (82 అడుగులు) ఉంటుందని చెప్పారు. మొత్తం 150 పిల్లర్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు.
రూ.360 కోట్ల పరిహారం చెల్లింపు..
ఓల్డ్‌సిటీ కారిడార్‌లో ఇప్పటివరకు 412 ఆస్తులకు అవార్డు జారీచేశారు. ఇందులో నివాసాలు కోల్పోయిన బాధితులకు రూ.360 కోట్ల నష్టపరిహారాన్ని అందించారు. అలాగే 380 ఆస్తులను తొలగించారు. కారిడార్‌లో వచ్చే పిల్లర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి వాటిని మార్కింగ్ చేస్తున్నారు. కాగా, ఓవైపు ఆస్తుల సేకరణను వేగవంతంగా పూర్తి చేస్తుండడంతోపాటు మరోవైపు నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా మతపరమైన కట్టడాలకు, విద్యుత్ తీగలకు ఎలాంటి నష్టం వాటిళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డీజీపీఎస్ సర్వే పూర్తి
పాతబస్తీలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ఇతర కేబుళ్లను జాగ్రత్తగా తొలగిస్తూ ముందుకు సాగుతున్నాం. మెట్రో స్తంభాలు, స్టేషన్లు వచ్చే చోట భూ సామర్థ్య పరీక్షలను త్వరలో చేపడతాం చారిత్రక, సున్నిత కట్టడాలకు నష్టం వాటిల్లకుండా పిల్లర్, స్టేషన్ల స్థానాన్ని నిర్ణయించేందుకు డీజీపీఎస్ సర్వే నిర్వహించాం. పిల్లర్లు, స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి లైన్లు, మంచినీటి లైన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ కేబుళ్లుగా మారుస్తాం.
-ఎన్వీఎస్ రెడ్డి, హెచ్పిఎంఎల్ ఎండీ
ఈ వార్తలు కూడా చదవండి..
సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు
కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News