Telangana HCA Scam: హెచ్‌సీఏ అక్రమాలు.. కేటీఆర్, కవితపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:23 PM
Telangana HCA Scam: హెచ్‌సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపిస్తూ సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరితో పాటు మరికొంత మందిపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్, జులై 17: హెచ్‌సీఏలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR), ఎమ్మెల్సీ కవితతో (MLC Kavitha) పాటు మరికొంత మందిపై సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఫిర్యాదు చేసింది. ఈరోజు (గురువారం) సీఐడీ చీఫ్ చారు సిన్హాను టీసీఏ అధికారులు కలిసి హెచ్‌సీఏ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా జగన్‌మోహన్ రావు గెలిచిన వెంటనే ‘నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకు అంకితం చేసినట్లు’ చెప్పారని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది.
మరికొందరు అక్రమార్కులు ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. టీసీఏ ప్రెసిడెంట్ యండల లక్ష్మీ నారాయణ, సెక్రెటరీ గురువారెడ్డి.. సీఐడీ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్‌మోహన్ రావు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్‌కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ చేయాలని సీఐడీని టీసీఏ అధికారులు కోరారు.
ఈడీకి కూడా..
హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంపై సీఐడీతో పాటు ఈడీకి కూడా ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మనీలాండర్ కోణం ఉందని విచారణ జరపాలని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది. ఇప్పటికే హెచ్‌సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు అందజేయాలని సీఐడీనీ ఈడీ కోరిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. ఈ క్రమంలో టీసీఏ ఫిర్యాదు, సీఐడీ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ నమోదు చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఆ చర్చలకు నువ్వు, నీ మామ రండి.. హరీష్‌కు టీపీసీసీ చీఫ్ ఛాలెంజ్
Read Latest Telangana News And Telugu News