Metro trains: ఆఫర్ల కోసం ఎదురుచూపు.. మెట్రోలో రెండేళ్లుగా పాత రాయితీలే
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:23 AM
నగర రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లలో కొత్త ఆఫర్లు కరువయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్రోను అధికంగా వినియోగించే వారు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు.

- సోషల్ మీడియా ద్వారా ప్రయాణికుల విజ్ఞప్తి
- పట్టించుకోని ఎల్ అండ్ టీ
హైదరాబాద్ సిటీ: నగర రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లలో కొత్త ఆఫర్లు కరువయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్రోను అధికంగా వినియోగించే వారు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. రోజువారీగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న తమ కోసం కొత్త ఆఫర్లు ప్రకటించాలని, తద్వారా నెలవారీ ఖర్చుల్లో ఆర్థికభారం తగ్గుతుందని ఎల్‌అండ్‌టీ యాజమాన్యాన్ని కోరుతున్నారు.
ప్రస్తుత ఆఫర్లు
కొవిడ్ రెండో దశ ముగిసిన తర్వాత మెట్రో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎల్ అండ్ టీ అధికారులు గతంలో కొన్ని రాయితీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్రో స్మార్ట్‌కార్డును అమలులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుడు మొదట రూ. 100తో స్మార్ట్‌కార్డు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఎంతైనా రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డుపై 10 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించారు. 2023 సెప్టెంబరులో సూపర్ సేవర్- 59 డిస్కౌంట్‌ను ప్రారంభించారు. ఇందులో ముందుగా ప్రయాణికుడు రూ.100తో మెట్రో స్మార్ట్‌కార్డు కొనుగోలు చేయాలి.
తర్వాత రూ. 59తో కార్డును రీచార్జి చేయించుకుంటే ప్రతి రెండో, నాలుగో శనివారం, ప్రతి ఆదివారంతోపాటు పబ్లిక్ హాలిడే్‌సలో మెట్రో రైళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరిగే అవకాశాన్ని కల్పించారు. స్టూడెంట్ పాస్ కింద విద్యార్థులు 20 ట్రిప్పుల డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం కల్పించారు. సూపర్ సేవర్ ఆఫ్-పీక్ అవర్ ఆఫర్‌లో భాగంగా రద్దీలేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డులపై (సీఎస్సీ) 10 శాతం తగ్గింపు ఇస్తున్నారు.
ఉపయోగపడని కాంటాక్ట్ లెస్ కార్డ్స్
నాన్ పీక్ అవర్స్‌లో కాంటాక్ట్ లెస్ కార్డు (సీఎస్సీ) ద్వారా చేసే బుకింగ్స్‌పై 10శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ ఆఫర్‌ను కేవలం 10 శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. పీక్ అవర్స్‌లో, రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రాయితీ ఇవ్వడంలేదని ప్రయాణికులు అంటున్నారు. కాంటాక్ట్ లెస్ కార్డులను అన్నివేళల్లో అమలు చేస్తే చాలామంది వినియోగించుకుంటారని అంటున్నారు. మెట్రోలో కొత్త ఆఫర్లను ప్రకటించాలని ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులు కోరుతున్నారు. ఏడాది ప్రయాణంపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించాలంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News