Mahesh Counter To Harish: ఆ చర్చలకు నువ్వు, నీ మామ రండి.. హరీష్‌కు టీపీసీసీ చీఫ్ ఛాలెంజ్
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:09 AM
Mahesh Counter To Harish: హరీష్ అడ్డగోలు వాదనతో, అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప హరీష్ రావుకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు.

హైదరాబాద్, జులై 17: మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Minister Harish Rao) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు (గురువారం) మీడియాతో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. హరీష్‌రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప అర అంగుళం మెదడు పెంచుకోలేదని విమర్శించారు. హరీష్ రావు వాదనలలో పసలేదన్నారు. ఢిల్లీ మీటింగ్‌లో ఏం జరిగిందో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ (Union Minister CR Patil) చెప్పిన తర్వాత హరీష్ రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్‌లో ఏయే అంశాలు మాట్లాడారో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రెస్‌మీట్ పెట్టి చెప్పినా కూడా హరీష్ రావు మెదడుకు ఎక్కనట్టు ఉంది అంటూ సెటైర్ విసిరారు. హరీష్ అడ్డగోలు వాదనతో, అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు.
సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప హరీష్ రావుకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు (Former CM KCR) సవాల్ విసిరారన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా తామే ఫామ్ హౌస్‌కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ పెడుతాము పాల్గొనండి అని సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదన్నారు. మళ్ళీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్నా సమస్య లేదు. రాయలసీమను రతనాల సీమ చేస్తాను. బెసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే కదా ఈరోజు వాళ్ళు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నది. తెలంగాణకు ద్రోహం చేసి మళ్లీ మీరే సిగ్గులేకుండా కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ వచ్చి మీ వాదన చెప్పండి. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది’ అని సవాల్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు
Read Latest Telangana News And Telugu News