Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:27 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రభాకర్‌రావు కీలకంగా ఉన్నారు. ఆయనను విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) ప్రభాకర్‌రావు కీలకంగా ఉన్నారు. ఆయనను విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) మొదటిరోజు రాత్రి వరకు ఆరున్నర గంటల పాటు ప్రభాకర్‌రావుని విచారించారు సిట్ అధికారులు. విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే రాత్రి పడుకున్నారు ప్రభాకర్‌రావు. అయితే, ఇవాళ (శనివారం) రెండోరోజు విచారణ ప్రారంభమైంది. ప్రభాకర్‌రావును పలు అంశాలపై విచారణ చేస్తున్నారు సిట్ అధికారులు.
నిన్నటి విచారణలో ప్రభాకర్‌రావుకు సంబంధించిన ఐదు ఐ క్లౌడ్, ఐదు జీమెయిల్ ఖాతాల్లోని డేటాపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. గతంలో నాలుగు జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్‌కు సంబంధించిన రెండు ఖాతాల పాస్‌వర్డ్‌లను గుర్తించారు. ఈ ఖాతాల్లో కనిపించని డేటాను ఫోరెన్సిక్‌కు పంపించారు. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు.
మరోవైపు.. సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ఈ డేటాపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే, విచారణలో ప్రభాకర్‌రావు నోరు విప్పితే కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుంచి తొలగించానని సిట్ అధికారులకు తెలిపారు ప్రభాకర్‌రావు.
ఆయన వాగ్మూలంపై వాస్తవం ఎంత అనేది జీమెయిల్, యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉంది. రెండోరోజు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కోసం డేటా ఎలా సేకరించారు..? ఎవరు ఇచ్చారు..? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి పరికరాలు వాడి ట్యాపింగ్‌కు పాల్పడ్డారు..? ఇలాంటి కీలక అంశాలు అన్నింటిపై అరా తీస్తున్నారు సిట్ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News