Minister Sridhar Babu: ఆ భూముల పరిష్కారానికి జోక్యం చేసుకోండి.. కేంద్రమంత్రికి శ్రీధర్ వినతి
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:43 PM
Minister Sridhar Babu: కేంద్ర రంగ సంస్థలకు ఇచ్చిన భూముల విషయంలో ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

న్యూఢిల్లీ, జూన్ 25: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు (బుధవారం) కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామితో (Union Minister Kumara Swamy) మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కుమారస్వామిని మంత్రి కోరారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేకం మూతపడ్డాయని.. కొన్ని ఉత్పత్తులను నిలిపివేశాయని.. ఆ భూములన్నీ ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయంటూ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేంద్ర రంగ సంస్థలు తమ భూములను వాణిజ్య పరంగా వినియోగానికి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కేంద్ర రంగ సంస్థలకు ఇచ్చిన భూముల విషయంలో ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని తెలిపారు. సరైన పరిహారం లేకుండానే భూములను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం లేదని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. భూముల విషయంలో రాష్ట్రాలకు మేలు కలిగేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రమంత్రి కుమారస్వామికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు ఇవే
1. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, మేడ్చల్-మల్కాజిగిరి – 324.87 ఎకరాలు
2. హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, సంగారెడ్డి – 126.33 ఎకరాలు
3. ఐడీపీఎల్, మేడ్చల్-మల్కాజిగిరి – 551.03 ఎకరాలు
4. హెచ్‌ఎంటీ, మేడ్చల్-మల్కాజిగిరి – 888.05 ఎకరాలు
5. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఆదిలాబాద్ – 2,272.85 ఎకరాలు
6. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎద్దుమైలారం, సంగారెడ్డి – 3,020 ఎకరాలు
ఇవి కూడా చదవండి
ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
Read latest Telangana News And Telugu News