Bomb Threat: పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:37 AM
శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 1: ఇండిగో విమానాలకు (Indigo Flight) తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో ఇండిగో విమానంలో బాంబులు ఉన్నట్లు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఆ తరువాత అదంతా ఫేక్ అని తేలడం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లుగా వచ్చిన మెయిల్ ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు (శనివారం) జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబాయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గత నెలలో కూడా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి మంగళూరు బయలుదేరిన ఇండిగో విమానం బాత్రూంలో బాంబు బెదిరింపు ఉన్న సందేశాలను ప్రయాణికులు గుర్తించి.. సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అలర్ట్ అయిన విమానాశ్రయ సిబ్బంది.. విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని.. అందంతా ఫేక్ అని నిర్ధారణ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ఇండిగో విమానాలకు పదే పదే ఇలాంటి బెదిరింపులు రావడంపై అధికారులు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు భావిస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తున్న ఆకతాయిలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తరచూ ఇలాంటి సందేశాలతో భయాందోళనకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
రెండేళ్ల తర్వాత.. నగరానికి దక్కిన మంత్రి పదవి
దారుణం.. రోడ్డుపై నగ్నంగా మొండెంతో మహిళ మృతదేహం
Read Latest Telangana News And Telugu News