Formula E car Race case: ఏసీబీ తుది నివేదిక.. కీలక అంశాలివే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:05 AM
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula E car Race case)కు సంబంధించి ఏసీబీ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఏ1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్, ఏ3 BLN రెడ్డి, ఏ4, ఏ5లుగా FEO ప్రతినిధులను తుది నివేదికలో ప్రస్తావించారు. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించడంతో క్విడ్ ప్రో కో జరిగిందని వివరించారు. బీఆర్ఎస్‌కి రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు అందాయని తుది నివేదికలో పేర్కొన్నారు. ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే బీఆర్ఎస్‌కి ఈ-బాండ్లు చెల్లించారని తెలిపారు.
ఫార్ములా-ఈ కార్ రేస్‌కు సంబంధించిన అనుమతులకు రాష్ట్ర గవర్నర్ సంతకం లేకుండానే ఐఏఎస్ అధికారి అరవింద్ రెండు అగ్రిమెంట్లు చేశారని స్పష్టం చేశారు. ఎంఏయూడీ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని.. సీఎం, సీఎస్, ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్న కూడా చెల్లింపులు, అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపారు. ట్రైపార్టీ అగ్రిమెంట్‌లో లేకపోయినా.. సీజన్-9 కోసం రూ.20కోట్లు ఖర్చు చేశారని ఏసీబీ అధికారులు నివేదికలో ప్రస్తావించారు.
ట్రైపార్టీ అగ్రిమెంట్‌లో హెచ్ఎండీఏ లేకపోయినా FEOకు రూ.46కోట్లు చెల్లించాలని.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, BLN రెడ్డి బిల్ పాస్ చేశారని తెలిపారు. సీజన్-10 కోసం హెచ్ఎండీఏ నుంచి రూ.54.88కోట్లు చెల్లించారని చెప్పుకొచ్చారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు హెచ్ఎండీఏపై అదనంగా రూ.8కోట్ల భారం పడిందని తెలిపారు. 2023 అక్టోబర్ 30వ తేదీన చేసుకున్న సెకండ్ అగ్రిమెంట్ కారణంగా.. సీజన్-10, 11, 12లతో కలిపి ప్రభుత్వంపై రూ.600కోట్లు భారం పడుతుందని వివరించారు.
హెచ్ఎండీఏ లేకుంటే ఈ బాధ్యత Ace NXT Genపై పడేదని తెలిపారు. నిల్సన్ రిపోర్ట్ చూపిస్తూ రూ.700కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ అబద్దాలు చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ.700కోట్లు లాభం వచ్చినట్లు ఏ రిపోర్ట్‌లో లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో దర్యాప్తునకు నిల్సన్ సహకరించలేదని తుది నివేదికలో ఉంది. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో కేటీఆర్‌ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏసీబీ అధికారులు ఈ కేసులో దూకుడు పెంచారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
Read Latest Telangana News And Telugu News