Srushti Fertility Center Scam: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం.. సంచలన విషయాలు వెలుగులోకి
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:06 PM
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో అక్రమ సరోగసీ, పిల్లల అమ్మకపు రాకెట్‌ను ఛేదించామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆదివారం డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.

హైదరాబాద్: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో (Srushti Fertility Center) అక్రమ సరోగసీ, పిల్లల అమ్మకపు రాకెట్‌ను ఛేదించామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ (DCP Rashmi Perumal) తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఇవాళ(ఆదివారం జులై 27) డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఒక జంట 2024 ఆగస్టులో సంతాన సాఫల్యం కోసం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారని వెల్లడించారు. డా. నమ్రత వారికి సరోగసీ చేయించుకోవాలని సూచించారని తెలిపారు. ఆ క్లినిక్ ద్వారా సరోగసీ తల్లిని ఏర్పాటు చేస్తామని దంపతులని నమ్మించారని అన్నారు. తొమ్మిది నెలల పాటు ఆ జంట క్లినిక్‌కు డబ్బులు చెల్లించారని గుర్తుచేశారు. 2025 జూన్‌లో సరోగసీ తల్లికి విశాఖపట్నంలో అబ్బాయి పుట్టాడని, డెలివరీ ఛార్జీలు చెల్లించి బిడ్డను తీసుకెళ్లాలని దంపతులకి సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. బిడ్డను డా. నమ్రత అప్పగించి, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, తప్పుడు డీఎన్ఏ సృష్టించారని అన్నారు. ఆ తర్వాత భార్యభర్తల వీర్యం, అండంతో బిడ్డ వారికి పుట్టినట్లుగా నమ్మించారని తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆ జంట నుంచి మొత్తం రూ. 35 లక్షలకు పైగా వసూలు చేసిందని వెల్లడించారు. తర్వాత, ఆ జంట డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా, బిడ్డ డీఎన్‌ఏ వారికి అసలు సరిపోలేదని తేలిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.
ఆ దంపతులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ని సంప్రదించగా, వారికి ఎలాంటి పత్రాలు ఇవ్వకుండా, డాక్టర్ నమత్ర కొడుకు బెదిరించారని... దీంతో వారు పోలీసులను ఆశ్రయించారని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. డాక్టర్ నమ్రత పెద్దఎత్తున అక్రమ సరోగసీ, సంతాన సాఫల్య ట్రీట్‌మెంట్ నిర్వహిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. డాక్టర్ నమ్రత విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కొండాపూర్‌లలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతోందని చెప్పుకొచ్చారు. డాక్టర్ నమ్రత తన క్లయింట్ల నుంచి రూ.20 నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి తప్పుడు రూపంలో మోసం చేస్తోందనీ తమ దర్యాపులో తేలిందని అన్నారు. ఈ నవజాత శిశువులను సరోగసీ ద్వారా జన్మించినట్లుగా క్లయింట్లను నమ్మించి, వారు తమ సొంత పిల్లలని భావించేలా డాక్టర్ నమ్రత చేసిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
ఈ కేసులో, అసలు బిడ్డ తల్లిదండ్రులు అసోం నివాసులని, హైదరాబాద్‌లో వారు నివసిస్తున్నారని వెల్లడించారు. విశాఖపట్నంలో డెలివరీకి డాక్టర్ నమ్రత ప్లాన్ చేశారని.. బిడ్డను తీసుకున్న తర్వాత వారికి స్వల్ప మొత్తాన్ని చెల్లించి, వారిని హైదరాబాద్‌కు పంపారని తెలిపారు. పిల్లలను అమ్మినందుకు, అసలు తల్లిదండ్రులను కూడా పట్టుకుని అరెస్టు చేశామని అన్నారు. ప్రస్తుతం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ని సీజ్ చేశామని.. లైసెన్స్ లేకుండా IVF చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో భారీగా పరికరాలు లభ్యమయ్యాయని.... వాటిని సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో మహారాణిపేట PS, II టౌన్ PS (విశాఖపట్నం), గోపాలపురం PS (హైదరాబాద్), కొత్తపేట PS (గుంటూరు)లలో పదికి పైగా కేసులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై నమోదయ్యాయని... వైద్య, ఆరోగ్య శాఖ గతంలో ఈ క్లినిక్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినప్పటికీ, నిందితురాలు డాక్టర్ నమత్ర మరో సర్టిఫైడ్ డాక్టర్ డా. సూరి పేరును ఉపయోగించి నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కేసులో ముఖ్య నిందితులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.
నిందితుల వివరాలు:
A1: డాక్టర్ అట్లూరి నమ్రత @ పచ్చిపాల నమ్రత (64), యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ యజమాని
A2: పచ్చిపాల జయంత్ కృష్ణ (25), నిందితురాలు డాక్టర్ నమ్రత కుమారుడు
A3: సి. కళ్యాణి అచ్చయ్యమ్మ (40), యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్
A4: గొల్లమండల చెన్నరావు (37), ల్యాబ్ టెక్నీషియన్ & ఎంబ్రియాలజిస్ట్
A5: నార్గుల సదానందం (41), అనస్థీషియా స్పెషలిస్ట్, గాంధీ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్
A6: ధనశ్రీ సంతోషి (38), అసోం నివాసి
A9: మహమ్మద్ అలీ (38), అసోం నివాసి
A10: శ్రీమతి నస్రీన్ బేగం (25), మహమ్మద్ అలీ ఆడిక్ భార్య, అసోం నివాసి
A 7, A 8 ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..
కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News