ACB RAIDS: టార్గెట్ కేటీఆర్.. దూకుడు పెంచిన ఏసీబీ.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:09 PM
ACB RAIDS: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Race Case) కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు. ఫార్ములా-ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, మచిలీపట్నంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. మాదాపూర్‌లోని ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ సోదాలు చేసింది. గ్రీన్‌కో, అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకు ఎన్నికల బాండ్లు వెళ్లడంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రూ.41కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఏసీబీ ఆరా తీస్తోంది.
ఇదిలా ఉండగా... ఏపీలోని మచిలీపట్నంలో గల ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారుల బృందం తనిఖీలు చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు చలమశెట్టి సునీల్‌కు చెందిన గ్రీన్కో అనుబంధ సంస్థలో సోదాలు చేస్తున్నారని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. చలమశెట్టి సునీల్ జన్మస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. సునీల్ తల్లి వెంకటలక్ష్మి గతంలో బందర్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఉదయాన్నే ఏసీబీ బృందం వచ్చింది. పై అధికారుల ఆదేశాల మేరకే తాము ఏపీలో సోదాలు చేస్తున్నామని తెలంగాణ ఏసీబీ అధికారులు తెలిపారు.
కాగా.. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది న్యాయస్థానానికి చెప్పారు. ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే హై కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పుతో ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 9న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.