CM Revanth Reddy: ఖజానా లూటీ.. కేసీఆర్ పనే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:53 AM
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని, తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని లూటీ చేసిన ఆయన.. ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పదేళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది
పథకాల ప్లానింగ్‌కు ఏడాదిన్నర సరిపోయింది
ఇక వాటి అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతా
కేసీఆర్‌లా లాంచింగ్, క్లోజింగ్, షోపుటప్ పథకాలుండవ్
రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా
కేసీఆర్ ప్రసంగంలో పస లేదు.. అక్కసు వెళ్లగక్కాడు
నేను సీఎం అయిన రెండోరోజే ఆయన గుండె పగిలింది
పిలగాళ్లంటూ కేటీఆర్, హరీశ్‌ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు?
ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు
పార్టీ నిర్ణయం తర్వాతే కగార్‌పై ప్రభుత్వ ప్రకటన
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు
నన్ను నమ్ముకున్నోళ్లను ఎన్నడూ మర్చిపోను. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఆయన ఓపిగ్గా నన్నే నమ్ముకుని ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అద్దంకి దయాకర్‌లాగా ఓపిగ్గా ఉంటే నాకూ బాధ్యత ఉంటుంది. అలా కాకుండా బయటికి వెళ్లి స్వీపింగ్ రిమార్కులు చేస్తే నాపైన భారం ఉండదు. చెల్లుకు చెల్లయిందని భావిస్తా.
- సీఎం రేవంత్‌రెడ్డి
సీఎంను కలిసిన కొత్త సీఎస్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె.రామకృష్ణారావు సోమవారం సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. బుధవారం సాయంత్రం సీఎ్‌సగా రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని, తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని లూటీ చేసిన ఆయన.. ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే తమకు ఏడాది సమయం పట్టిందన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చల అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘గడిచిన ఏడాదిన్నర కాలం పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా చేస్తా. కేసీఆర్ మాదిరిగా లాంచింగ్.. క్లోజింగ్ స్కీములు.. షోపుటప్ పథకాలు నా వల్ల కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులకు అందే వరకూ పనిచేస్తా’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని, ఎన్నికలకు ఆరు నెలల ముందు వీటిపైనే చర్చ జరుగుతుందని చెప్పారు. తాను కక్ష సాధింపు చర్యలకు దిగబోనని స్పష్టం చేశారు. కేటీఆర్ మీద కేసు.. ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులన్నింటిపైనా విచారణ చట్ట పరిధిలోనే జరుగుతుందన్నారు. తాను చట్ట ప్రచారమే పని చేస్తానని, కేసీఆర్‌లాగా చట్టాన్ని అతిక్రమించి అరెస్టులు చేయించబోనని చెప్పారు. బీఆర్‌ఎ్‌సకు పదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు.. తమకూ పదేళ్లు ఇస్తారని అన్నారు.
రెండో రోజే గుండె పగిలింది
ఎల్కతుర్తి బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో పసే లేదని, ప్రసంగం యావత్తూ తన అక్కసును వెళ్లగక్కారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అభద్రతా భావంతో ఆయన చేసిన ప్రసంగంలో స్పష్టతే లేదన్నారు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ‘‘కేసీఆర్ సభకు ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చాం. దీనివల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. బస్సులు ఆపితే సభ ఆగిపోతుందనుకునే ఆలోచన వారిదే. బీఆర్‌ఎస్ హయాంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ జరిగితే.. వాళ్లు కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు’’ అని తప్పుబట్టారు. కేసీఆర్ సభతో పోలిస్తే గజ్వేల్‌లో తాము నిర్వహించిన సభే హైలెట్ అన్నారు.
ఆ రోజు నేను చెప్పిందే.. కేసీఆరూ చెప్పాడు
అసెంబ్లీకి వస్తున్న కేటీఆర్, హరీశ్ రావు చిన్న పిల్లలని తాను చెప్పానని, అసెంబ్లీలో తాను ఏం చెప్పానో.. బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ కూడా అదే చెప్పాడని సీఎం అన్నారు. కేటీఆర్, హరీశ్ పిల్లగాళ్లంటున్న కేసీఆర్.. మరి తాను అసెంబ్లీకి రాకుండా వారిని ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు.
రాహుల్‌తో మంచి సంబంధాలే
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, ఈ విషయంలో ఎవరినీ నమ్మించాల్సిన అవసరం తనకు లేదని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే ఇందిరా గాంధీని మించిన యోధురాలు లేదని, ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెదని కొనియాడారు. ప్రధాని మోదీ, కేసీఆర్ తమ అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తుంటారని, దేశానికి ఇందిరా గాంధీ వంటి ప్రధాని కావాలని అభిలషించారు. తనను నమ్ముకున్న వారిని తాను ఎన్నడూ మరిచిపోనని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఓపిగ్గా నన్నే నమ్ముకుని ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దయాకర్‌లాగా ఓపిగ్గా ఉంటే నాకూ బాధ్యత ఉంటుంది. అలా కాకుండా బయటికి వెళ్లి స్వీపింగ్ రిమార్కులు చేస్తే నాపైన భారం ఉండదు. చెల్లుకు చెల్లయిందని భావిస్తా’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, కొంతమంది అధికారుల విషయాలు తెలిసినా.. వారినే కొనసాగించాల్సి వస్తోందని, ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పట్లేదని వ్యాఖ్యానించారు. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉందని, అందుకే మార్చుకుంటున్నామని చెప్పారు.
ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లోనే ఉండాలి
ఎమ్మెల్యే అయ్యాక మనోడు, మందోడు అనేది ఉండదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ‘‘కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే టైం పాస్ చేస్తున్నారు. అది సరికాదు. వారు నియోజక వర్గాల్లోనే ఉండి.. అవసరమైనప్పుడు మాత్రమే హైదరాబాద్‌కు రావాలి. వారు ప్రజల్లోకి వెళితేనే.. పథకాలూ ప్రజల్లోకి వెళతాయి’’ అని స్పష్టం చేశారు.
కగార్‌పై పార్టీ నిర్ణయం తర్వాతే ప్రభుత్వ ప్రకటన
కగార్ అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. మావోయిస్టుల అంశంపై మాజీ మంత్రి జానారెడ్డి, కె.కేశవరావుతో చర్చించామని, వారితో గతంలో శాంతి చర్చలు జరిపిన అనుభవం వీరిద్దరికీ ఉందని గుర్తు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చల కోసం కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను అధిష్ఠానానికి పంపిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తాన్ని జానారెడ్డి, కేకేలే చూసుకుంటారని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్