CM Revanth Reddy: కేటీఆర్ పిరికిపంద
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:10 AM
నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు.

డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు
పరీక్షలకు జుట్టు, రక్తం ఇస్తానని చెప్పి.. తర్వాత మాటమార్చాడు
ఆయన చుట్టూ ఉన్నోళ్లంతా గంజాయి బ్యాచే కదా!
చీకట్లో రహస్యంగా లోకేశ్‌తో ఎందుకు భేటీ అయ్యారు!?
పనితనం తెలుసు కాబట్టే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు
కేటీఆర్, హరీశ్, కవితలకు వాళ్ల ఇంట్లోనే విలువ లేదు
కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించాం
దొంగ సారా అమ్మిన జగదీశ్ రెడ్డి కూడా నీతులు చెబితే ఎలా!?
సోడా పోయడం.. సారా అమ్మడం.. ఈ రెండే ఆయనకు తెలిసినవి
కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్లను 23ు కి తగ్గించిందే కేసీఆర్
ముస్లిం కోటాను బీజేపీ రాష్ట్రాల్లో తీసేసి.. ఇక్కడ డిమాండ్ చేయాలి
42ు కోటా అమలుకు మా వ్యూహం మాకుంది.. అమలు చేస్తాం
మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘‘నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు. పరీక్షల కోసం రక్తం, జుట్టు ఇస్తానని సవాల్ విసిరి, మాట మార్చి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ది గంజాయి బ్యాచ్ అని, ఆ బ్యాచ్ సవాల్ విసిరితే తాను స్పందించాలా? అని ప్రశ్నించారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ‘‘కేటీఆర్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కేదార్ రకరకాల డ్రగ్స్ ఒకేసారి తీసుకొని దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను తెప్పించాం. అసెంబ్లీ సాక్షిగా ఆ నివేదికను బయట పెడతాం. కేటీఆర్ బావమరిది ఫాంహౌ్‌సలో గంజాయి, డ్రగ్స్‌తో దొరికాడు. కేటీఆర్ చుట్టూ ఉన్నోళ్లంతా గంజాయి బ్యాచ్‌నే కదా?’’ అని ప్రశ్నించారు. వాళ్ల మాటలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అధికారికంగా తాను చర్చల్లో పాల్గొంటే తప్పుబడుతున్న కేటీఆర్.. ఆ రాష్ట్ర మంత్రి లోకేశ్‌తో చీకట్లో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్టు.. కేటీఆర్ చేసేవన్నీ ఎవరికీ తెలియదనుకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్‌లో చీకట్లో ఎవరికీ తెలియకుండా లోకేశ్‌ను కలిసిన విషయం అందరికీ తెలుసన్నారు. దాంతో, ‘మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ అవసరం తమకు లేదని, వారి భేటీ గురించి బీఆర్‌ఎస్ వ్యక్తులే అందరికీ చెబుతున్నారు కదా? అని బదులిచ్చారు.
కేటీఆర్‌ను నాయకుడిగా ఇంట్లో వాళ్లే ఒప్పుకోవట్లేదు
కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదని, ఇంట్లో వాళ్లే కేటీఆర్‌ను నాయకుడిగా ఒప్పుకోకపోతే ఇక ప్రజలెలా అంగీకరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తండ్రి దగ్గరికి వెళ్లి అడగలేని కేటీఆర్.. సవాళ్లు విసరడం విడ్డూరంగా ఉంది. కేటీఆర్ పనితనం తెలుసు కాబట్టే.. ఆయన ఎలాగూ పనికిరాడనే కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఉచిత, పనికిమాలిన సలహాలు ఇవ్వడం, సవాళ్లు విసరడం మానేసి ముందు ఇంటి సమస్యను పరిష్కరించుకోండి. అది సాధ్యం కాకపోతే కనీసం ఇంటికే పరిమితం కండి. అప్పుడు కనీస మర్యాదైనా దక్కుతుంది’’ అని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్, కవిత తీసేసిన తహసీల్దార్లని, వాళ్లకు ఇంట్లోనే విలువ లేదని, ప్రజలకు ఏం చేప్తారని విమర్శించారు.
తప్పు చేస్తే శిక్ష తప్పదు.. ఎవరూ తప్పించుకోలేరు
తప్పు చేస్తే తెల్లారే శిక్ష పడకపోవచ్చని, కానీ, శిక్ష తప్పదని, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను మొదటే అరెస్టు చేయలేదు. దర్యాప్తును కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత చివర్లోనే అరెస్టు చేశారు. తెలంగాణలో జరిగిన కుంభకోణాల్లోనూ ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఎన్నో సినిమాల్లో చూస్తాం కదా? విలన్ సినిమా చివర్లోనే చనిపోతాడు. అప్పటి వరకూ ఓపిక పట్టాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులపై; ఈ ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్, విద్యుత్తు కొనుగోళ్లలో జగదీశ్ రెడ్డిపై విచారణ జరుగుతోందని వివరించారు.
ముఖ్యమంత్రుల భేటీలో రోడ్ మ్యాప్ వేశాం
ముఖ్యమంత్రుల భేటీలో తెలంగాణ భవిష్యత్తు నీటి అవసరాల కోసం రోడ్ మ్యాప్ వేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేశాం. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్నవి.. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, నీటి కేటాయింపులకు సంబంధించి అధికారులు, ఇంజినీర్ల కమిటీ చూస్తుంది. ఆ కమిటీతో పరిష్కారం కాని అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరిస్తాం’’ అని వివరించారు. గోదావరి- కావేరి (వయా నాగార్జున సాగర్) అనుసంధానాన్ని కేంద్రం ప్రతిపాదించిందని, అయితే.. పాత లెక్కల ప్రకారం డీపీఆర్ తయారు చేశారని, ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, దాంతో, మరోసారి సమగ్రంగా డీపీఆర్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ద్రోహి కేసీఆర్
‘‘తెలంగాణ ద్రోహి కేసీఆర్. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాం (2004-2014)లో రాయలసీమకు 728 టీఎంసీలు పోతే.. బీఆర్‌ఎస్ హయాంలో (2014-23) 1200 టీఎంసీలు తరలించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనడానికి ఇది సరిపోదా!?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడు రాయలసీమకు నీళ్లు నిలిపేస్తే.. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆపిస్తే అది తెలంగాణ విజయం కాదా? అని నిలదీశారు. ‘‘కేంద్రం, ఏపీతో చర్చకు పోకపోతే.. కేసీఆర్‌లా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో పడుకోవాలా? గతంలో 2016, 2020ల్లో అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కేసీఆర్, హరీశ్ పాల్గొనలేదా? వాళ్లు హాజరైతే విజయం, నేను, ఉత్తమ్ పాల్గొంటే అపచారం ఎలా అవుతుంది!?’’ అని నిలదీశారు. భారత్, పాక్ మధ్యే జల ఒప్పందం జరిగిందని, పక్కనే ఉన్న ఏపీతో మాత్రం వద్దంటే ఎలాగని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషమే ఉంటుందని, జల వివాదం పరిష్కారం కాకూడదని, ఇలాగే ఉంటే రాజకీయంగా కొంతకాలమైనా బతకొచ్చనే స్వార్థం వాళ్లదని మండిపడ్డారు. కేసీఆర్ తనకు శత్రువు కాదని, రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టతనిచ్చారు. ‘‘తెలంగాణ మీ తాత జాగీరా అని హరీశ్ అడుగుతున్నాడు. మరి హరీశ్ తాత, మామల జాగీరా!? తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చలు జరగడం, పరిష్కారం దొరకడం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు ఇష్టం లేదు. కేసీఆర్‌ది సంకుంచిత మనస్తత్వం’’ అని విమర్శించారు.
కొట్లాట నా చివరి అస్త్రం
సమస్య ఏదైనా చర్చలతో పరిష్కరిద్దామనుకునే మనస్తత్వం తనదని, కొట్లాట తన చివరి అస్త్రమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఎవరికైనా భయపడితే తాను రేవంత్ రెడ్డిని ఎలా అవుతానని ప్రశ్నించారు. తాను కేవలం వ్యవస్థకు మాత్రమే భయపడే వ్యక్తినని, తన ప్రాధాన్యం రాష్ట్రం, ప్రజలు మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘ఇదే ధోరణితో కేంద్రం, ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా. ప్రతి దానికీ కొట్లాడుడే అంటే.. పాలకులకు లాభం జరుగుతుందేమో కానీ.. అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. నా వైఖరి వల్లే సుదీర్ఘ కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. ఎలివేటర్ కారిడార్ కోసం ఎంతో విలువైన రక్షణ రంగానికి చెందిన భూముల బదలాయింపు జరిగింది. పదేళ్ల క్రితమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. ఫెడరల్ వ్యవస్థలో భాగంగా కేంద్రంతో సఖ్యతగా ఉన్నా.. తెలంగాణకు ఎంతో మేలు జరిగేది. కానీ.. రాజకీయ స్వార్థమే బీఆర్‌ఎస్ లక్ష్యం. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పెంచితే రాజకీయంగా కొంత కాలమైనా బతకొచ్చని ప్రయత్నిస్తున్నారు. వాళ్లది అధికారం, ఆస్తుల పంచాయితీ. మాది ప్రజల జీవితాలు, భవిష్యత్తు తరాలకు మంచి జరగాలనే ఆరాటం’’ అని వ్యాఖ్యానించారు. 21న మరోసారి ఢిల్లీకి వస్తానని, తెలంగాణ కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వస్తూనే ఉంటానని చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్రకు వెళతానని తెలిపారు.
ప్రధాన ప్రతిపక్ష నేత వస్తే చర్చకు సిద్ధమే
ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తే ఏ అంశంపైన అయినా చర్చకు తాను సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష నేతగా గౌరవిస్తామని, ఆయన అనుభవంతో సలహాలివ్వాలని కేసీఆర్‌కు సూచించానని, ఆయన మాత్రం ఫాంహౌజ్‌కే పరిమితమవుతున్నారని తప్పుబట్టారు. ‘‘అంతే తప్ప.. కేటీఆర్‌కు ఏ స్థాయి ఉందని ఆయన సవాళ్లను నేను పరిగణనలోకి తీసుకోవాలి. కేటీఆర్ సవాళ్లకు ఆయన స్థాయి వ్యక్తులనే పంపిస్తాను. నల్లగొండలో సవాల్ అంటే.. కేటీఆర్ స్థాయి వ్యక్తి కాబట్టే ఎమ్మెల్యే మందుల సామేల్ వస్తాడని చెప్పా’’ అని వ్యాఖ్యానించారు. దొంగ సారా కాయడం, సోడా పోయడం తప్ప జగదీశ్ రెడ్డికి ఇంకేమీ తెలియదన్నారు. నల్లగొండ ఎక్సైజ్ ఆఫీసుకు వెళితే జగదీశ్ రెడ్డి సారా బాగోతం తెలుస్తుందన్నారు. చివరికి.. దొంగ సారా అమ్మిన జగదీశ్ రెడ్డి కూడా నీతులు చెబితే ఎలాగని ప్రశ్నించారు. ఉత్తమ్‌పై పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన వ్యక్తి సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించిందే కేసీఆర్
‘‘కాంగ్రెస్ పార్టీ 2014కు ముందు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది. వాటిని 23 శాతానికి తగ్గించిందే కేసీఆర్’’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ 2018లో కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి బీసీలకు అన్యాయం చేశారన్నారు. ఆ చట్టంలో ఇప్పుడు 50 శాతం పరిమితిని ఎత్తి వేస్తూ... ఆర్డినెన్స్ తెస్తున్నామని చెప్పారు. ‘‘50 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు వేరు. ప్రస్తుత ఆర్డినెన్స్ వేరు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడని చెప్పుకొనే లక్ష్మణ్‌కే ఈ బిల్లు, ఆర్డినెన్స్‌పై అవగాహన లేదు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు ఉండగానే.. ఆర్డినెన్స్ ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని లక్ష్మణ్ కాగితంపై రాసి ఇస్తే... 48 గంటల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి కేంద్రానికి పంపుతాం’’ అని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఆర్డినెన్స్ ఆమోదానికి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్‌ఎ్‌సఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. ముందు అక్కడ తొలగించి.. ఆ తర్వాత తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేయాలి’’ అని సవాల్ విసిరారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఎన్నికపైనా రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ బీసీకి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, బీజేపీ అయ్యగారికి అప్పగించిందని వ్యాఖ్యానించారు. అలాగే, 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తమ దగ్గర వ్యూహం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వర్గీకరణ, కుల గణన సర్వేపై కూడా ఇలాంటి విమర్శలు చేశారని, వాటిని విజయవంతంగా చేసి చూపించామని చెప్పారు.
ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను రక్షించేందుకు కిషన్‌రెడ్డి ప్రయత్నం
ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకొని పర్యవేక్షిస్తోందని, మళ్లీ కొత్తగా న్యాయస్థానం కలగజేసుకోవాల్సిన అవసరం ఏముందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో అన్న కిషన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదో ప్రజలకు చెప్పాలి. కేవలం కేసీఆర్‌ను కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును దేశానికి తీసుకు రావడంలో ఏడాదిన్నర జాప్యం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభాకర్ రావును తీసుకురావాల్సి వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత కేసు విచారణ చకచకా ముందుకు సాగుతోంది. చివరి దశకు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్రానికి అప్పగించాలని కోరుతున్న కిషన్ రెడ్డి.. తెలంగాణలో కీలక కేసులన్నీ ఈడీకి అప్పగిస్తే ఏం సాధించారు!? జీహెచ్‌ఎంసీ, ఈ-ఫార్ములా, గొర్రెల స్కాం.. వంటివి అప్పగిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు!?’’ అని నిలదీశారు. కేంద్ర హోం మంత్రి సహా ఎవరినైనా కలిసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయించారా? అని నిలదీశారు. ఇందులో కేసీఆర్ పాత్ర ఉందని, ఆయన్ని అరెస్టు చేస్తే నిజాలు బయటికి వస్తాయని చెప్పారా? అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లాభం చేకూరేలా కేసీఆర్‌ను కేసుల నుంచి బయట పడెయ్యాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ఇంజినీర్ల అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో ఏసీబీ దాడులతో ప్రజలకు అర్థమైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా కాళేశ్వరం అక్రమాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఎన్నో నిజాలను బయటికి తీసుకొచ్చామని అన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి