Hyderabad: ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం!
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:55 AM
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై బీఆర్‌ఎస్ వర్గాలు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసు విభాగం అప్రమత్తమైంది.

నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం
సంస్థ కార్యాలయాల ముందు భద్రత ఏర్పాటు
బీఆర్‌ఎస్ ఖబర్దార్.. మీడియాపై దాడులు సహించం
రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు
బీఆర్‌ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంతుచూస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరిక
కేసీఆర్‌ను ఉద్యమకారుడిగా చూపిందే ఆంధ్రజ్యోతి
మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది
ఏబీఎన్‌పై దాడి చేస్తే 2 గంటల్లో టీ న్యూస్‌పై దాడి చేస్తాం
బీఆర్‌ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్/జగిత్యాల, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై బీఆర్‌ఎస్ వర్గాలు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసు విభాగం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి నిఘా వర్గాలకు దాడి అవకాశాలపై సమాచారం వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే సంస్థ కార్యాలయాల వద్ద రక్షణ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్గాల వైఖరిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ఆ పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా ఇంకా బుద్ది రాలేదని వ్యాఖ్యానించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు తమను నమ్మకపోవడంతో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు మీడియా సంస్థలపై దాడులకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు.
తక్షణమే మీడియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా ేస్వచ్ఛకు భంగం కలిగిేస్త ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు. మీడియా సంస్థలు ఏదైనా తప్పుగా రాస్తే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే మీడియాకు బీజేపీ రక్షణ కవచంగా నిలబడుతుందని ప్రకటించారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు అండగా నిలవాలని బీజేపీ యువ మోర్చా నేతలకు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ‘‘బీఆర్‌ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నా. ఇకపై మీడియా సంస్థలపై, అమాయక ప్రజలపై దాడులు చేశారో ఖబడ్దార్. మీ అంతు చూస్తాం. మీ లాగే మేం ఆలోచిస్తే మీ బూతు ఛానల్ టీ న్యూస్‌ను ఎప్పుడో భూస్థాపితం చేసేవాళ్లం. మీడియా సంస్థలను బీజేపీ గౌరవిస్తుంది. మాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తే తప్పులుంటే సరిదిద్దుకుంటాం. కావాలని తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా ముందుకెళ్తాం. వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ మాది’’ అన్నారు. మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేస్తే టీ న్యూస్ అంతు చూస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు తలచుకుంటే అడుగు కూడా బయట పెట్టలేరన్నారు.
ఏబీఎన్‌పై దాడిచేస్తే 2 గంటల్లోనే టీ న్యూస్‌పై ప్రతి దాడి చేస్తాం: బండి సంజయ్
జగిత్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే బీఆర్‌ఎ్‌సకు చుక్కలు చూపిస్తామని అన్నారు. ‘‘మీరు తలచుకుంటే పది ఇరవై మంది వస్తారు. యువ మోర్చా కార్యకర్తలు వందల మంది ఉన్నారు. మీ గుండాయిజం తెలంగాణలో నడవనివ్వం’’ అన్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా సంపాదకీయం రాస్తే పేపర్, టీవీపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని సంజయ్ తెలిపారు. మహా టీవీపై దాడి చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ జాగీర్ కాదని, వాడు, వీడు అని మాట్లాడితే కాంగ్రెస్ వాళ్లు ఊరుకుంటారేమో గానీ, తాము మాత్రం రోడ్ల మీద బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్ కూడా తిరగనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘‘ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్‌లు లాఠీ దెబ్బలు తిన్నారా, జైలుకు వెళ్లారా? ఇయాల వేల కోట్లు సంపాదించి దుబాయి, మస్కట్‌లో వ్యాపారాలు చేస్తోంది నిజం కాదా?’’ అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఫైనాన్స్ పైసలు కట్టలేకపోతే కేసీఆర్ కారును గుంజుకుపోయారన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తమతో పాటు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మద్దతిస్తూ కేసీఆర్ కుటుంబం ఎన్ని తప్పులు చేసినా బాహాటంగా మద్దతిచ్చిందని చెప్పారు.
ఉద్యమకాలంలో కేసీఆర్‌ను హీరోను చేసింది ఆంధ్రజ్యోతేనన్నారు. నేడు ఆయన చేసిన తప్పులను ఎత్తిచూపితే దాడులకు తయారవుతారా? అని ప్రశ్నించారు. దాడి అనగానే లోపలేయకుండా సీఎం ఏం చేస్తున్నారు? అన్నారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో తనను, డ్రోన్ ఎగరేశారనే సాకుతో రేవంత్‌రెడ్డిని గతంలో జైల్లో వేసి బెయిల్ రాకుండా చేశారని ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డి పౌరుషం ఎటు పోయిందని, ఎందుకు కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే 2 గంటల్లోపే టీ న్యూస్‌పై దాడి తప్పదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలను ఆదేశించారని చెప్పారు. తాను హోంమంత్రిగా ఈ మాటలు చెప్పకూడదని, కానీ కాంగ్రెస్ ఉద్దేశ పూర్వకంగా బీఆర్‌ఎ్‌సతో రాజీ పడుతున్న నేపథ్యంలో ఏ మీడియా సంస్థ మీద దాడి జరిగినా మీడియాకు తాము అండగా ఎదురు దాడి చేస్తామని పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నానని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కిరాయి ఇస్తే వచ్చే వాళ్లు కాదని, సిద్ధాంతాన్ని నమ్ముకొని తీవ్రవాదులకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్లమని చెప్పారు. రాజకీయ పార్టీ కార్యాలయంలో న్యూస్ ఛానల్‌ను ఎలా కొనసాగిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
పింకీల పైశాచిక ఆనందం: చనగాని
ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేయడం.. పింకీల పైశాచిక ఆనందనానికి నిదర్శనమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్ అన్నారు. రాధాకృష్ణ కొత్త పలుకులో అన్నీ వాస్తవాలే రాశారని చెప్పారు. వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలైనా బీఆర్‌ఎస్ నేతలకు అహంకారం ఇంకా తగ్గలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా స్వేచ్చను కాపాడుతుందని చెప్పారు.
కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: అద్దంకి దయాకర్
తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి ఏబీన్ ఆంధ్రజ్యోతి సహకరించిందని, ఉద్యమంలో ఉన్న తమకు అది తెలుసునని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మీడియా అనుకూలంగా ఉంటే.. పూలదండలు, లేకుంటే దాడులు చేస్తామంటే కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మీడియాపై రెచ్చగొట్టేలా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. వారి అక్రమాలపై ఎవరూ మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ట్రాప్‌లో పడొద్దని, ఆయన మాటలు విని క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సూచించారు.
తప్పులు ఎత్తి చూపితే ఆంధ్రా పత్రికలా?: ఆది శ్రీనివాస్
తెలంగాణలో బీహార్ తరహా రౌడీయిజాన్ని బీఆర్‌ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తి చూపితే ఆంధ్రా పత్రికలంటూ మాట్లాడుతున్నారన్నారు. మీడియాపై దాడి చేసిన వారిని తప్పు పట్టకుండా ఇంకా దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చినపుడే ప్రజల గుండెల్లో నుంచి ఆ పార్టీ పోయిందన్నారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి