Share News

Mobile Network: వర్షం వచ్చినప్పుడు మొబైల్ సిగ్నల్ రావట్లేదా? సింపుల్ సొల్యూషన్స్ ఇవే!

ABN , Publish Date - Jul 28 , 2025 | 08:36 AM

వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్‌వర్క్‌ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Mobile Network: వర్షం వచ్చినప్పుడు మొబైల్ సిగ్నల్ రావట్లేదా? సింపుల్ సొల్యూషన్స్ ఇవే!
Tips to Fix Mobile Signal During Rain

వర్షాకాలంలో తరచూ వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వల్ల మొబైల్ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ బలహీనడపడతాయి. అందుకే మొబైల్ వినియోగదారులు ఈ సమయంలో సిగ్నల్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా కాల్స్, డేటా ఉపయోగించేవారి పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. మొబైల్ నెట్‌వర్క్ లేదా డేటా కనెక్షన్ కోల్పోతే రోజువారీ పనులకు అడ్డంకి ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించి కమ్యూనికేషన్ సజావుగా సాగాలంటే.. ఈ సింపుల్ సొల్యూషన్స్ పాటిస్తే చాలు.


ఎయిర్‌ప్లేన్ మోడ్‌

మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉంటే, ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి 10-15 సెకన్లు వేచి ఉండండి. ఆపై మళ్లీ ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రీసెట్ చేస్తుంది. సమీపంలోని టవర్‌కి కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఈ సాధారణ ట్రిక్ తరచుగా తక్షణ సిగ్నల్ మెరుగుదలకు సహకరిస్తుంది.

ఫోన్ సెట్టింగ్‌లను తనిఖీ

ముందుగా మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి. కొన్నిసార్లు ఫోన్ 4G లేదా 5Gకి ఆటోమేటిక్‌గా మారడానికి బదులుగా 2G లేదా 3Gలో నిలిచిపోయి ఉండవచ్చు. సెట్టింగ్‌లకు వెళ్లి 'మొబైల్ నెట్‌వర్క్' ఆప్షన్ క్లిక్ చేసి 4G లేదా 5Gని సెలెక్ట్ చేసుకోండి. ఇది సిగ్నల్ ను మెరుగుపరుస్తుంది. అయిప్పటికీ బలహీనంగా ఉంటే ఫోన్ 'నెట్‌వర్క్ మోడ్'ని 'ఆటోమేటిక్'కి సెట్ చేయండి. తద్వారా మీ ఫోన్ అందుబాటులో ఉన్న ఉత్తమ సిగ్నల్‌కు కనెక్ట్ అవుతుంది.

'సెట్టింగ్స్ > మొబైల్ నెట్‌వర్క్‌లు > నెట్‌వర్క్ ఆపరేటర్లు' కు వెళ్లి 'సెర్చ్ నెట్‌వర్క్‌' ఎంచుకోండి. అప్పుడు మీరు బలమైన టవర్ లేదా నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా ఎంచుకోవచ్చు.


Wi-Fi కాలింగ్

ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పటికీ Wi-Fi అందుబాటులో ఉంటే Wi-Fi కాలింగ్ యూజ్ చేయండి. దీని కోసం సెట్టింగ్‌లలో 'Wi-Fi కాలింగ్' ఆప్షన్ ఆన్ చేయండి. మొబైల్ సిగ్నల్ లేకపోయినా మీరు Wi-Fi ద్వారా కాల్స్ చేయవచ్చు. ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మొబైల్‌ రీస్టార్ట్

మొబైల్ రీస్టార్ట్ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. బలమైన సిగ్నల్ పొందే అవకాశాలను పెంచుతుంది. చాలాసార్లు రీస్టార్ట్ చేయడం వల్ల సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.


సిగ్నల్ బూస్టర్

వర్షాకాలంలో మీరు తరచుగా సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంటుంటే సిగ్నల్ బూస్టర్ కొనే విషయం గురించి ఆలోచించండి. ఈ చిన్న డివైజ్ ఇంట్లో సిగ్నల్ బలహీనపడకుండా చూస్తుంది. దీన్ని కిటికీ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది బలహీనమైన సిగ్నల్‌లను సంగ్రహించి వాటిని బలమైన సిగ్నల్‌గా మారుస్తుంది. గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాలలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

ఫోన్ సాఫ్ట్‌వేర్ పాతది అయినా సిగ్నల్ సమస్యలు వస్తాయి. సెట్టింగ్‌లలో ' సాఫ్ట్‌వేర్ అప్‌డేట్' ఆప్షన్ తనిఖీ చేసి అందుబాటులో ఉన్న ఏవైనా అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఫోన్ నెట్‌వర్క్ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు.


నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌

పైన పేర్కొన్న అన్ని టిప్స్ ఉపయోగించినా సిగ్నల్ సమస్య కొనసాగితే.. మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి. బహుశా మీరుండే ప్రాంతంలో టవర్‌ సమస్య ఉండవచ్చు. దానిని వారు పరిష్కరించవచ్చు. లేదా మరో మార్గంలో మీ సమస్యకు పరిష్కారం చూపుతారు.

సిమ్ కార్డు

కొన్నిసార్లు, సిమ్ కార్డు లోపల దుమ్ము లేదా ఇతర లోపాల వల్ల కూడా సిగ్నల్ సమస్యలు వస్తాయి. అందుకే ఓసారి సిమ్ కార్డును తీసివేసి మృదువైన గుడ్డతో శుభ్రం చేయండి. తర్వాత మళ్లీ ఇన్‌సర్ట్ చేయండి.


ఇవి కూడా చదవండి:

చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ

సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పిన గూగుల్ ఏఐ గణాంకాలు చూశారా..

Read Latest and Technology News

Updated Date - Jul 28 , 2025 | 09:58 AM