Sourav Ganguly: ఆ స్థానం సరిపోదు: గంగూలీ
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:49 AM
వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా టెస్ట్ ఓటమి తర్వాత ముందుగా అందరూ ప్రశ్నిస్తుంది.. తుది జట్టులో మూడో స్థానం గురించే! ఆ స్థానంపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఛెతెశ్వర్ పుజారా తర్వాత వన్ డౌన్‌లో ఎవరూ స్థిరత్వం సాధించలేకపోయారు. విరాట్ కోహ్లీ, గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్... ఇప్పుడు వాషింగ్టన్ సుందర్. అయితే ప్రదర్శన చేయట్లేదనేది విషయం కాదు. కానీ స్థిరత్వం లేకపోవడం కూడా జట్టుకు ఓ బలహీనతే. అయితే వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) మాట్లాడాడు.
‘వాషింగ్టన్ సుందర్(Washington Sundar) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు ఓ మంచి క్రికెటర్. చక్కగా బౌలింగ్ వేయగలడు. అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. కానీ టెస్టు క్రికెట్‌లో మూడో స్థానం అతడికి సరిపోదు. జట్టులో మొదటి ఐదుగురు బ్యాటర్లు కచ్చితంగా స్పెషలిస్టులే ఉండాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లో వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరిపోతాడని నేను అనుకోవడం లేదు. ఈ విషయంపై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి సారించాలి’ అని గంగూలీ సూచించాడు.
ఆ అవసరం లేదు..
‘కోల్‌కతా టెస్టులో వాషింగ్టన్ సుందర్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అలాంటప్పుడు జట్టులో నలుగురు స్పిన్నర్లను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిచ్‌లో టర్న్ ఉంటే ప్రధాన బౌలర్లు 20 నుంచి 30 ఓవర్లు బౌలింగ్ వేయగలరు. అందుకే నాలుగో స్పిన్నర్ అవసరం లేదు. గౌతమ్ గంభీర్ ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి’ అని గంగూలీ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
‘వర్క్‌లోడ్’ సాకుగా మారింది: సునీల్ గావస్కర్
ఇది అతడి కెరీర్‌కే ప్రమాదం: దినేశ్ కార్తీక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి