Sunil Gavaskar: ‘వర్క్‌లోడ్’ సాకుగా మారింది: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Nov 19 , 2025 | 07:25 AM
సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. దేశవాళీల్లో ఆడకపోతే ఇలాంటి పిచ్‌లపై ఆడలేరని విమర్శలు గుప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు ఓడి.. మూడు రోజులు కాస్తున్నా టీమిండియాపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు. కారణం.. పిచ్, బ్యాటర్ల నిలకడలేమి. ఏ ఒక్క టీమిండియా బ్యాటర్ క్రీజులో ఉండలేకపోయారు. ఫలిత్ం.. తొలి టెస్టు మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో సఫారీలపై ఓటమి. స్పిన్ ఉచ్చుకు బలైన టీమిండియాపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) ఘాటుగా స్పందించాడు.
‘మన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడట్లేరు. డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే ఈ రకమైన స్పిన్ పిచ్‌లపై ఆడగలిగే సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే దేశవాళీ స్థాయిలో కూడా జట్లు తీవ్రంగా పోటీ పడుతాయి. రంజీ ట్రోఫీ నాకౌట్‌కు అర్హత సాధించేందుకు కావాల్సిన పాయింట్ల కోసం శ్రమిస్తాయి. దేశవాళీ క్రికెట్‌లో ర్యాంక్ టర్నర్ పిచ్‌లు ఉంటాయి. కానీ మన ఆటగాళ్లు ఎవరూ దేశవాళీలో ఆడట్లేరు. వాస్తవానికి మన ప్రస్తుత జట్టులో ఎవరికీ రంజీల్లో ఆడేందుకు ఇష్టం లేదు. ఎందుకు అంటే వర్క్‌లోడ్ అంటారు. అందరికీ ఆ పదం సాకుగా మారింది’ అని గావస్కర్ వివరించాడు.
ఫామ్ కోల్పోతేనే..
‘వర్క్‌లోడ్‌ను సాకుగా చూపిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫామ్ కోల్పోతేనే వారికి రంజీ క్రికెట్ గుర్తొస్తుంది. అంతే తప్పా ఎవరికీ దేశవాళీ ఆడాలనే ఆసక్తి లేదు. టర్నింగ్ పిచ్‌లతో విజయాలు సాధించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లను ఎంచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ఇలాంటి పిచ్‌లపై ఆడే దమ్ములేదు. ఎందుకంటే వారికి ఇలాంటి పిచ్‌లపై ఆడిన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు’ అని గావస్కర్ విమర్శలు గుప్పించాడు.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి