Shikhar Dhawan: మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్న ధావన్, హర్భజన్
ABN , Publish Date - Nov 25 , 2025 | 10:06 AM
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్(Shikhar Dhawan), హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరు బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టిస్తే.. మరొకరు తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను భయపెట్టేవాడు. వీరిద్దరూ కొన్నేళ్ళ పాటు తమదైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించారు. తరువాత రిటైర్మెంట్ ప్రకటించి.. కాస్తా విశ్రాంతి తీసుకుంటున్నారు. శిఖర్ ధావన్, హర్భజన్(Harbhajan Singh) ఆటకు ఎంతో మంది ఫిదా అయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరూ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్‌లో అనేక రకాల లీగ్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్నిటికి మాత్రమే ఆదరణ ఉంటుంది. అలాంటి వాటిల్లో లెజెండ్స్ ప్రొ టీ20 లీగ్(Legends Pro T20 Leagu) ఒకటి. ఇందులో అన్ని దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటారు. టీమిండియా మాజీ ప్లేయర్లు ధావన్, హర్భజన్ సింగ్ తో సహా పలువురు ఈ లీగ్ బరిలోకి దిగనున్నారు. గోవా వేదికగా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ లీగ్ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లతో పాటు పలువురు అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఈ లీగ్‌లో భాగస్వాములు కానున్నారు.
సౌతాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్(Dale Steyn), ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కూడా ఈ లీగ్ ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ లీగ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. అన్నీ జట్లలో కలిపి 90 మంది లెజండరీ ప్లేయర్లు పాల్గొననున్నారు. ఈ లీగ్ పై ఆసీస్ స్టార్ ప్లేయర్ క్లార్క్(Michael Clarke) మాట్లాడుతూ.. ‘క్రికెట్‌కు అతిపెద్ద నిలయంగా ఉన్న భారత్ నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. ఈ లీగ్‌లో నేను కూడా భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడి అభిమానులకు ఆటపై మక్కువ. ఈ లీగ్ ద్వారా పలువురు పాత మిత్రులతో పాటు, గతంలో హోరాహోరీగా తలపడిన ప్రత్యర్థులను తిరిగి కలిసే ఛాన్స్ దక్కనుంది’ అని క్లార్క్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం
టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!