Sanju Samson: సీఎస్కేకి వెళ్లడంపై స్పందించిన సంజూ
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:00 PM
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కే జట్టు జడేజాను వదిలి సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడటంపై సంజూ శాంసన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈ సీజన్‌లో అందరి దృష్టి రవీంద్ర జడేజా-సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌పైనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు జడేజాను వదిలి.. సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా జడేజాను రాజస్థాన్ రాయల్స్ రూ.14కోట్లకు సొంతం చేసుకోగా.. సంజూ ఐపీఎల్(IPL) వేతనం రూ.18కోట్లకే సీఎస్కే తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉండే సంజూ.. ఉన్నట్టుండి జట్టు మారడంపై అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సంజూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
సమయం వచ్చింది..
‘మనం ఈ ప్రపంచంలో కొన్నాళ్ల పాటే ఉంటాం. రాజస్థాన్ రాయల్స్ కోసం నా సర్వస్వం ధారబోశాను. ఆటను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను, బంధాలను పోగు చేసుకున్నాను. ఫ్రాంచైజీలో ప్రతి ఒక్కరినీ నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా. నాకు ఇక్కడ లభించిన ప్రతి అవకాశానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అని సంజూ పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్(RR)తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఓ ఫొటోను సంజూ(Sanju Samson) షేర్ చేశాడు.
నాటి నుంచి..
2013లో ఆర్ఆర్ జట్టులో చేరిన సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ 2018లో రాజస్థాన్‌కు తిరిగొచ్చి 2025 వరకు ఇదే జట్టుకు ఆడాడు. కెప్టెన్‌గా రాజస్థాన్‌ను ముందుకు నడిపించిన సంజూ 2022 ఐపీఎల్ సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అక్కడ గుజరాత్ టైటాన్స్(GT)తో టైటిల్ పోరులో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 176 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. 4704 పరుగుల చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
క్రికెట్‌లోకి సచిన్ అరంగేట్రం ఈరోజే!
అది మాకు కఠినమైన నిర్ణయమే: సీఎస్కే సీఈవో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి