IPL 2026: అది మాకు కఠినమైన నిర్ణయమే: సీఎస్కే సీఈవో
ABN , Publish Date - Nov 15 , 2025 | 02:47 PM
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదిలి సంజూ శాంసన్‌ను ట్రేడ్‌లో సొంతం చేసుకుంది. ఈ నిర్ణయం తమకు కఠినమైనదని, కానీ తప్పలేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026.. కొద్ది రోజులుగా తీవ్రంగా జరుగుతున్న ప్రచారమే.. నేడు(శనివారం) నిజమైంది. ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ వస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఆ ఫ్రాంచైజీ వదులుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన సంజూ శాంసన్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది. జడేజాతో పాటు సామ్ కరన్ కూడా చెన్నై జట్టును వీడి రాజస్థాన్‌లో చేరాడు.
వారి సమ్మతితోనే..
జడేజా(Ravindra Jadeja) చెన్నై జట్టును వీడటంపై ఆ ఫ్రాంచైజీ సీఈవో(CEO) కాశీ విశ్వనాథన్ మాట్లాడారు. ‘జట్టుకు టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని చెన్నై యాజమాన్యం కోరుకుంది. కానీ ఆక్షన్‌లో ఎక్కువ మంది భారత బ్యాటర్లు లేరు. దీంతో ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలనుకున్నాం. కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోన్న రవీంద్ర జడేజాను వదులుకోవడం నిజంగా కఠిన నిర్ణయమే. తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు తన ఆలోచనను ఆటగాళ్లతో పంచుకుంది. వారి సమ్మతితోనే ఈ ట్రేడ్‌కు వెళ్లింది. అలాగే రవీంద్ర జడేజా కూడా సానుకూలంగా స్పందించాడు. సామ్ కరన్‌ను వదులుకోవడం కూడా కఠినమైన నిర్ణయమే. వీరు తమ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు దృష్ట్యా జట్టును బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మాకు భారత బ్యాటర్‌ను పొందడానికి ఇంతకంటే అవకాశం కనపడలేదు’ అని వెల్లడించాడు.
వారి బాధ అర్థం చేసుకోగలం..
సంజూ శాంసన్(Sanju Samson ) కూడా ఐపీఎల్‌లో అనుభవమున్న ఆటగాడు. అతడు దాదాపు 4,500కు పైగా పరుగులు చేశాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కూడా సారథిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం. జడేజా వదులుకోవడంపై చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారని తెలుసు. వారి నుంచి ఎన్నో మెసేజ్‌లు కూడా వచ్చాయి. వారి బాధను అర్థం చేసుకోగలం. కానీ మార్పు తప్పలేదు. రానున్న కాలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి లాగే మెరుగైన ప్రదర్శన, నిలకడను కొనసాగిస్తుంది’ అని విశ్వనాథన్ పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రవీంద్ర జడేజా 12 సీజన్ల నుంచి ఆడుతున్నాడు. 2022 సీజన్‌లో కొద్ది కాలం కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. జడేజా చెన్నై తరఫున ఇప్పటి వరకు 186 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు తీసుకున్నాడు. 2,198 పరుగులు చేశాడు. ఈ ఆల్‌రౌండర్ లీగ్ ఫీజ్‌ను రూ.18కోట్ల నుంచి రూ.14కోట్లకు తగ్గించి రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సంజూ శాంసన్ లీగ్ ఫీజులో ఎలాంటి మార్పు చేయకుండా రూ.18కోట్లకు సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే?
టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి