IPL 2026: కింగ్ మేకర్స్ వెనుక ‘క్వీన్స్’!
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:25 PM
ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. మైదానంలో ఆటగాళ్లు ఎంతో కష్టపడుతుండటమే మనం చూస్తుంటాం.. తెర వెనకు జట్టును నడిపించే వారు వేరొకరు ఉంటారు. ఐపీఎల్‌లోని అనేక ఫ్రాంచైజీలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మహిళలే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్.. యువ ఆటగాళ్ల భవిష్యత్తుకు సరైన వేదిక. సీనియర్ల ఫిట్‌నెస్‌కు ఓ ప్రాక్టీస్ మ్యాచ్. అభిమానులకు పండగ. అయితే.. తమ ఫ్రాంచైజీలను గెలిపించడానికి యజమానులు పడే కష్టం కూడా మరో ఎత్తు. తెర వెనుక జరిగే ఈ ప్రక్రియ వెనుక మహిళల సహకారమే ఎంతో ఉంది. అదెలాగంటారా..? ఐపీఎల్‌లోని అనేక ఫ్రాంచైజీలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మహిళలే. అయితే ఈ సందర్భంగా ఐదుగురు పవర్‌ఫుల్ మహిళా ఓనర్ల గురించి తెలుసుకుందాం..
నీతా అంబానీ..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) ముంబై ఇండియన్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. ఐపీఎల్ లీగ్ ప్రారంభం నుంచే ఆమెకు ఈ జట్టు(MI)తో అనుబంధం ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఎంఐ ఒకటి. ఇప్పటివరకు ఆ జట్టు ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్‌గా నిలిచింది.
కావ్య మారన్..
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్య మారన్(Kavya Maran) సీఈవోగా ఉన్నారు. సన్‌గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, సన్‌టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావేరి కళానిధి ముద్దుల తనయే కావ్య. కావ్యకు స్పోర్ట్స్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో తమ గ్రూప్‌నకు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టులో కీలకపాత్ర పోషించింది. ఆ ఆసక్తితోనే 2018లో ఫ్రాంచైజీ సీఈవోగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాకుండా సహ యజమానిగా ఆ జట్టులో సమూల మార్పులు చేసింది. గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగేటప్పుడు తన హావభావాలతో వైరల్ అవుతూ ఉంటుంది.
ప్రీతి జింటా..
బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి ప్రీతీ జింటా(Preity Zinta) ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు. ఆ జట్టు ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా పడలేదు. కానీ ప్రీతీ నిరంతరం దాని కోసం శ్రమిస్తూ ఉంటారు. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఐపీఎల్ కోసం తిరిగి ఇండియాకి రానున్నారు.
జుహీ చావ్లా..
ఈమె కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) జట్టుకు సహ యజమానిగా ఉన్నారు. ప్రారంభ సీజన్లలో కేకేఆర్ నలుపు రంగు జెర్సీలో ఆడేది. అది అశుభంగా భావించి జెర్సీ మార్పునకు చావ్లా(Juhi Chawla) ఎంతో కృషి చేశారు. ఆమె కారణంగా జెర్సీ రంగు మారింది. ఆ తర్వాతే కేకేఆర్ మూడుసార్లు టైటిల్ అందుకుంది.
రూపా గురునాథ్..
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) యాజమాన్యం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ చేతిలో ఉంది. రూపా గురునాథన్(Rupa Gurunath) దీనికి డైరెక్టర్. ఎం.ఎస్. ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నప్పటికీ.. రూపా తెర వెనుక ఉండి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆమె తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమె హయాంలో జట్టు రెండుసార్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి
అలా బతకడం చాలా కష్టం: సానియా మీర్జా
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి