Sania Mirza: అలా బతకడం చాలా కష్టం: సానియా మీర్జా
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:34 AM
సానియా స్నేహితురాలు ఫరా ఖాన్ హోస్ట్ చేసిన షో ‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించింది. సింగిల్ మదర్‌గా బతకడం చాలా కష్టమని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: సానియా మీర్జా.. తన ఆటతో, ఆకర్షణతో ఒక తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార. ఒక భారత అమ్మాయి గ్రాండ్‌స్లామ్ టోర్నీకి అర్హత సాధించడమే గగనమైన పరిస్థితుల్లో.. ఏకంగా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల టెన్నిస్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ.. కొన్ని తరాలకు ప్రేరణనిచ్చేలా ఆటలో అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఈ ఘనతలన్నీ ఒక ఎత్తు అయితే.. సానియా తన జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆమె లైఫ్‌లో జరిగిన కఠిన క్షణాలను తాజాగా గుర్తు చేసుకుంది. విడాకుల తర్వాత ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి ఆమె(Sania Mirza) యూట్యూబ్ షోలో వెల్లడించింది.
పానిక్ అటాక్‌కు గురయ్యా..
సానియా స్నేహితురాలు ఫరా ఖాన్(Farah Khan) హోస్ట్ చేసిన షో ‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించింది. ‘సింగిల్ మదర్‌గా బతకడం చాలా కష్టం. అది నాకు చాలా క్లిష్టమైన సమయం. విడాకుల తర్వాత నేను ఓ లైవ్ షోకి వెళ్లడానికి కూడా వణికిపోయాను. తీవ్రమైన ఒత్తిడి వల్ల నాకు పానిక్ అటాక్ అయింది. ఆ సందర్భంలోనే ఫరా నా జీవితంలో అండగా నిలిచింది. ఫరా రాకపోయి ఉంటే నేను ఆ షో చేసేదాన్ని కాదు. అంత ధైర్యం నాకు వచ్చేది కాదు’ అని సానియా గుర్తు చేసుకుంది. ఆ వెంటనే స్పందించిన ఫరా..‘నీకు పానిక్ అటాక్ అయిందని తెలిసి చాలా భయపడ్డాను. షూటింగ్‌ను మధ్యలోనే ఆపేసి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను’ అని తెలిపింది.
సానియా మీర్జా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik)ను వివాహం చేసుకుంది. 2018లో వీరికి కుమారుడు ఇజాన్ మీర్జా జన్మించాడు. అయితే 2024 జనవరిలో సానియా-షోయబ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి