Kai Trump: ‘మయామీ గోల్ఫ్’లో చేరిన కై ట్రంప్
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:24 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ మయామీ యూనివర్సిటీ మహిళా గోల్ఫ్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆమె తొలి మ్యాచ్ ఫ్లోరిడాలోని ‘ది అన్నికా’ టోర్నీలో ఆడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ దేశ అధ్యక్షుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్‌పై పడింది.
ట్రంప్ మొదటి కుమారుడు జూనియర్ ట్రంప్-వెనెస్సా ట్రంప్ దంపతుల పెద్ద కుమార్తె ఈ కై ట్రంప్(Kai Trump). తాజాగా ఆమె మయామీ యూనివర్సిటీ మహిళా గోల్ఫ్ జట్టులో చోటు దక్కించుకుంది. మయామీ మహిళా గోల్ఫ్ జట్టులో కొత్తగా చేరిన ముగ్గురు క్రీడాకారిణుల్లో కై ఒకరు. వెస్ట్ పామ్ బీచ్‌లోని తన పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసింది. అయితే ఈమె 2024లోనే మయామీ(Miami University)లో చేరాలని నిర్ణయించుకున్నారట. ‘కోచ్‌లు బాగా నచ్చారు. ఇంటికి దగ్గరగా ఉంటుంది. మంచి యూనివర్సిటీ. మా కుటుంబ సభ్యులు కూడా అక్కడ చదివారు. అందుకే మయామీని ఎంచుకున్నాను’ అని కై తెలిపారు.
తొలి మ్యాచ్ ఎక్కడంటే..
ప్రస్తుతం కై ట్రంప్ ఎల్పీజీఏ టూర్‌లో తన తొలి మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. ఈ వారం ఫ్లోరిడాలో జరుగుతున్న ది అన్నికా టోర్నీలో కై పాల్గొననుంది. స్వీడన్‌కు చెందిన గోల్ఫ్ దిగ్గజం అన్నికా సొరెన్స్టామ్ కైకి గైడింగ్ కోచ్‌గా ఉంది. ‘కై చాలా ధైర్యంగా, ఆసక్తిగా ఆడుతోంది. 17 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉండటం.. ఇంత ఆసక్తిగా ఆడటం ఆశ్చర్యకరం’ అని ఆమె ప్రశంసించారు. మరోవైపు కోచ్ జానిస్ ఒలివెన్షియా కూడా ఈ విషయంపై మాట్లాడారు. ‘కై మయామీ జట్టుకు కొత్త ఉత్సాహం తెస్తుంది. ఆమెకు గోల్ఫ్‌పై నిజమైన ప్రేమ, ఆసక్తి ఉన్నాయి. కై క్రమంగా మెరుగై ఉన్నత స్థాయికి చేరుకుంటుందని విశ్వసిస్తున్నాం’ అని తెలిపారు. అయితే ట్రంప్ మనవరాలు గోల్ఫ్ మైదానంలో కొత్త సంచలనంగా నిలుస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి