Ind Vs SA: 15 ఏళ్లలో ఇదే తొలిసారి!
ABN , Publish Date - Nov 13 , 2025 | 08:47 AM
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా కోహ్లీ లేకుండా ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంట్లో తొలి మ్యాచ్ కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. భారత జట్టు ఇక్కడ చివరి మ్యాచ్ 2019లో పింక్ బాల్ టెస్ట్ ఆడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ గ్రౌండ్‌లో టీమిండియా ఆడనుంది.
ఓ పెద్ద లోటు..
ఈ సిరీస్(India vs South Africa )లో ఓ పెద్ద లోటు స్పష్టంగా కనిపించనుంది. అదే గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) లేకపోవడం. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కింగ్.. ఈసారి మైదానంలో కనపడడు అని తల్చుకుంటేనే అభిమానుల ఉద్వేగం కట్టలు తెచ్చుకుంటుంది. టీమిండియా(Team India) కోహ్లీ లేకుండా ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో కోహ్లీ తుది జట్టులో లేడు. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రతి మ్యాచ్‌లో విరాట్ అద్భుత ప్రదర్శనలు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐదు టెస్టులు..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens Test) వేదికగా కోహ్లీ ఐదు టెస్టు సిరీస్‌లు ఆడాడు. 46.14 సగటుతో 323 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వీటిలో ఒకటి పింక్ బాల్ టెస్టులో నమోదు చేశాడు. అయితే.. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు గెలుపు దిశగా నడవడమే కాకుండా.. కోహ్లీ లేని లోటుని కూడా తీర్చడానికి ప్రయత్నించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఈడెన్ గార్డెన్స్‌లో ఇలా..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా ఇప్పటి వరకు 42 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 20 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరోవైపు, టీమిండియా ఈ గ్రౌండ్‌లో సౌతాఫ్రికాతో మొత్తం మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వీటిలో రెండు టీమిండియా, ఒకటి సౌతాఫ్రికా గెలిచాయి. ఈ రెండు జట్ల మధ్య మొదటిసారిగా 1996లో టెస్టు మ్యాచ్ జరిగింది. ఇందులో సౌతాఫ్రికా 329 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత 2004, 2010లో జరిగిన టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
సంజూని తీసుకోవడం పిచ్చి నిర్ణయం: మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి