IPL 2026: ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో!
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:43 AM
ఐపీఎల్ 2026 ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నవంబర్ 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను జట్టులో ఉంచుతాయి? ఎవరిని ట్రేడ్ చేస్తాయి? అనే విషయంపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. నవంబర్ 15 ఆటగాళ్ల రిటెన్షన్‌కు ఆఖరి తేదీ కావడంతో ఫ్రాంచైజీలన్నీ ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఏ ఆటగాడిని వదులుకోవాలి.. ఎవరిని జట్టులో ఉంచాలి..! అనే విషయాలపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులోనే ట్రేడ్ డీల్ కూడా భాగమై ఉండటంతో ఈ చర్చలు మరింత తీవ్రతరమయ్యాయి.
జడేజా సీఎస్కేని వీడినట్టేనా?
ఈ సీజన్‌లో సీఎస్కే(CSK) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను వదులుకుని.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson)ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే యోచిస్తున్నట్లు సమాచారం. సంజూ-జడేజా ఐపీఎల్ వేతనం రూ.18 కోట్లు. దీంతో ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను రాజస్థాన్ ఫ్రాంచైజీకి పంపించి.. సంజూని సీఎస్కేకి తీసుకోనున్నారు. మరోవైపు సీఎస్కే నుంచి సామ్ కరన్‌ను కూడా రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అతడి ఐపీఎల్ వేతనం రూ.2.40కోట్లు. దీంతో ఆర్ఆర్ నుంచి ఆ డబ్బు కట్ చేసి సీఎస్కే పర్సులో ఆ డబ్బును కలుపుతారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.
ట్రేడింగ్‌లో మరికొంత మంది..?
మరికొంత మంది ఆటగాళ్ల విషయంలోనూ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) కోసం కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేకేఆర్(KKR) స్పిన్నర్ మయాంక్ మార్కండే, ఎస్ఆర్‌హెచ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రిటెన్షన్ పూర్తయ్యాక..
ఈ రిటెన్షన్ పూర్తి అయ్యాక ఫ్రాంచైజీలు వేలంపై దృష్టిపై సారిస్తాయి. వేలంలో ఎవరెవరిని తీసుకోవాలో ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంఐ(MI) అర్జున్ టెండూల్కర్‌ను విడిచిపెట్టే ప్రయత్నంలో ఉంది. అయితే ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
ఐపీఎల్ 2026 మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ మే 31న ముగుస్తుంది. మినీ వేలం డిసెంబర్ 15-16 తేదీల్లో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా గతేడాది రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ జట్టు సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.
ఇవి కూడా చదవండి
వోల్వార్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి