Share News

WTC 2025-27: టీమిండియా ఫైనల్ చేరాలంటే?

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:28 PM

డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్‌లు ఆడేసింది. వీటిలో నాలుగు గెలిచి, మూడు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరి టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలంటే..

WTC 2025-27: టీమిండియా ఫైనల్ చేరాలంటే?
WTC 2025-27

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలో టెస్టులో టీమిండియా(Team India) పరాభవాన్ని చవి చూసింది. స్వదేశంలో హుందాగా గెలవాల్సిన మ్యాచ్‌ను 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. ఈ పేలవ ప్రదర్శనతో అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్న.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(WTC) ఫైనల్‌కు భారత్ ఈ సారైనా అర్హత సాధిస్తుందా?


డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్‌లు ఆడేసింది. ఇప్పటి వరకు ఏ జట్టూ ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. మ్యాచ్‌ల పరంగా భారత్ తర్వాత ఇంగ్లండ్(5) తర్వాతి స్థానంలో ఉంది. టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది కానీ.. వీటిలో గెలిచింది కేవలం నాలుగు మాత్రమే. మూడింట్లో ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక టీమిండియా చేతిలో మరో పది మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి.


చెమటోడ్చాల్సిందే..

ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మన కంటే ముందు శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. డబ్ల్యూటీసీ 2025-27లో టీమిండియా ఇంకా సౌతాఫ్రికాతో 1, శ్రీలంకతో 2, న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. దీంట్లో ఆరు టెస్టులు స్వదేశంలోనే ఆడాలి. ఒకప్పుడు సొంత గడ్డపై మ్యాచ్ అంటే ఈజీగా తీసుకునే వాళ్లు. కానీ న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, తాజాగా సౌతాఫ్రికా చేతిలో ఓటమితో పరిస్థితులు భిన్నంగా మారాయి. గిల్ సేన ప్రతి మ్యాచ్‌కు ప్రాక్టీస్ ఇంకా పెంచాలి. కచ్చితంగా గ్రౌండ్‌లో చెమటోడిస్తేనే ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఉంటాయి.


ఎన్ని గెలవాలంటే..

ఈ పది మ్యాచుల్లో అన్నింట్లోనూ విజయం సాధిస్తే టీమ్‌ఇండియా 172 పాయింట్లు, 79.63 పాయింట్ల పర్సంటేజ్‌ సొంతం చేసుకుంటుంది. అయితే గత రికార్డులు పరిశీలిస్తే పాయింట్ల పర్సంటేజ్‌ కనిష్ఠంగా.. దాదాపు 65 కంటే ఎక్కువ ఉంటేనే ఆయా జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ పది మ్యాచుల్లో కనీసం 8 మ్యాచులు గెలిస్తేనే టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశముంది.


ఇవి కూడా చదవండి:

అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్

టైటిల్ సినర్‌దే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 12:28 PM