ATP Finals: టైటిల్ సినర్‌దే..
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:12 AM
ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ యానిక్ సినర్ టైటిల్ గెలిచాడు. స్పెయిన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ అల్కరాజ్‌ను ఓడించాడు. దీంతో వరుసగా రెండేళ్లు ఈ టైటిల్ అందుకున్న ఆటగాడిగా సినర్ రికార్డు సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో యానిక్ సినర్(Jannik Sinner) టైటిల్ గెలిచాడు. ఫైనల్‌లో సినర్ 7-6, 7-5తో అల్కరాజ్(స్పెయిన్)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో సినర్ 5-6తో వెనకబడ్డాడు.ఈ స్థితిలో సెట్ పాయింట్ కాచుకుని టైబ్రేకర్‌కు నడిపించాడు. టై బ్రేకర్‌లో సర్వీసుల్లో అదరగొట్టి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో తొలి గేమ్‌లోనే సర్వీస్ కోల్పోయినా.. సినర్ తిరిగి పుంజుకున్నాడు. 3-3తో స్కోరు సమం చేశాడు. ఈ సెట్ కూడా టైబ్రేకర్‌కు మళ్లుతుందేమో అనిపించింది. పన్నెండో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసిన సినర్, సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే టైటిల్ ఓడినా.. ఈ టోర్నీలో అల్కరాజే(Alcaraz) అగ్రస్థానంలో ఉండటం విశేషం.
రికార్డులివే..
తాజా విజయంతో సినర్ రెండో ఏడాది ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో టైటిట్ దక్కించుకున్నాడు. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా సినర్ టైటిల్ గెలిచే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఓడినా.. ముఖాముఖి రికార్డులో 10-6 తేడాతో సినర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
1970లో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు వరుసగా రెండేళ్లు ఒక్క సెట్ కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా సినర్ రికార్డు సృష్టించాడు.
టైటిల్ నెగ్గిన సినర్‌కు రూ.44 కోట్ల 92 లక్షల ప్రైజ్ మనీతో పాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఏటీపీ ఫైనల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన తొమ్మిదో ప్లేయర్‌గా సినర్ గుర్తింపు పొందాడు. గతంలో జకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్), పీట్ సంప్రాస్ (అమెరికా), ఇలీ నస్టాసె (రొమేనియా), జాన్ మెకన్రో (అమెరికా), జాన్ బోర్గ్ (స్వీడన్), లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సాధించారు.
ఇవి కూడా చదవండి:
ఎలా తయారు చేయాలో నాకు తెలుసు: ముఖర్జీ
అది టర్నింగ్ పిచ్ కాదు: అశ్విన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి