Sunil Gavaskar: అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:50 AM
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఒక్క టెంబా బావుమా తప్పా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో ఉండలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు 93 పరుగుల వద్దే ఆలౌటయ్యారు. కానీ సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(55*) మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇరుజట్లూ ఒక్కసారి కూడా 200 పరుగుల మైలురాయిని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో పిచ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు. ‘భారత బ్యాటర్లు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma)ను చూసి నేర్చుకోవాలి. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మంచి టెక్నిక్, అంకితభావంతో క్రీజులో పాతుకుపోయాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా.. టీమిండియా బ్యాటర్లు ఆడి ఉండాల్సింది’ అని సన్నీ పేర్కొన్నాడు.
అది క్యురేటర్ ఇష్టం..
పిచ్‌పై వస్తున్న విమర్శలు, పిచ్ తయారీపై క్యురేటర్‌కు భారత శిబిరం సూచనలు ఇవ్వడంపై సునీల్ మాట్లాడాడు. ‘ఐపీఎల్‌లో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా క్యురేటర్ విషయంలో జోక్యం చేసుకోదు. వారికి ఎలాంటి పిచ్ తయారు చేసి ఇవ్వాలో సూచించదు. క్యురేటర్ స్వతంత్రంగా విధులు నిర్వహిస్తాడు. అతడు హోం ఫ్రాంచైజీకి అభిమాని అయితే మాత్రం వారికి అనుకూలంగా పిచ్‌ను తయారు చేస్తాడు. అది కూడా అతడి ఇష్టం. క్యురేటర్ చేయాల్సిన పనేంటో.. ఇతరుల కన్నా అతడికే బాగా తెలుసు. అందుకే అతడి విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. తాము కోరినట్లుగానే పిచ్ తయారు చేసివ్వమంటే.. అది ఎదురుదెబ్బ తినేలా చేయొచ్చు. అందుకే క్యురేటర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలి’ అని సునీల్ గావస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఎలా తయారు చేయాలో నాకు తెలుసు: ముఖర్జీ
అది టర్నింగ్ పిచ్ కాదు: అశ్విన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి