Cristiano Ronaldo: 20 ఏళ్ల కుర్రాడిలా అదరగొడుతున్న రొనాల్డో.. సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
ABN , Publish Date - Jun 28 , 2025 | 06:57 PM
టాప్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఏటికేడు మరింతగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. వయసు పెరుగుతున్నా అతడు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

క్రీడల్లో వయసు అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆటల్లోకి అరంగేట్రం చేయడం దగ్గర నుంచి ఎప్పటివరకు కొనసాగాలనే విషయం దాకా అంతా వయసు మీదే ఆధారపడి ఉంటుంది. ఏజ్, ఫిట్‌నెస్‌ను బట్టే ఆటగాళ్లు ఎప్పుడు రిటైర్ అవ్వాలనే నిర్ణయం కూడా తీసుకుంటారు. అయితే కొందరు ప్లేయర్లు మాత్రం వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ఫిట్‌గా మారుతూ అందర్నీ ఆశ్చర్యాలకు గురిచేస్తుంటారు. అలాంటి అరుదైన అథ్లెట్లలో టాప్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఒకడు. 40 ఏళ్ల ఈ లెజెండరీ ప్లేయర్.. 20 ఏళ్ల కుర్రాడిలా అదరగొడుతున్నాడు. మోస్ట్ ఫిట్టెస్ట్ అథ్లెట్‌గా అందరి చూపులు తన వైపునకు తిప్పుకుంటున్నాడు.
వయసు తక్కువే..
ఫుట్‌బాల్ లాంటి కఠినమైన క్రీడల్లో ఫిట్‌గా ఉంటూ ఇన్నేళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించడం అంత ఈజీ కాదు. కానీ రొనాల్డో మాత్రం ఇప్పటికీ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో వరుస టోర్నీల్లో ఆడుతూ వరల్డ్ బెస్ట్ ప్లేయర్‌గా దుమ్మురేపుతున్నాడు. అతడి ఫిట్‌నెస్, హెల్త్ సీక్రెట్ ఏంటో కనుక్కునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఈ విషయంపై సౌదీ అరేబియాకు చెందిన డాక్టర్ మహ్మద్ అలీ అల్ అహ్మదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బయటకు కనిపించే ఫిజికల్ ఏజ్ కంటే రొనాల్డో బయోలాజికల్ ఏజ్ ఇంకా తక్కువ అని అన్నారు. అతడు అథ్లెట్ మాత్రమే కాదు.. ఒక కేస్ స్టడీ అని చెప్పారు.
సీక్రెట్ అదే..
‘రొనాల్డోను కేవలం అథ్లెట్‌గా మాత్రమే చూడొద్దు. అతడో కేస్ స్టడీ. అతడి బయోలాజికల్ ఏజ్ 20 అని చెప్పొచ్చు. 40 ఏళ్లు నిండినా అతడు రోజురోజుకీ మరింత చిన్నవాడిలా మారుతున్నాడు. వయసు పెరుగుతున్నా అతడు యవ్వనంగా కనిపిస్తున్నాడు. ఇందుకు ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. రొనాల్డో శరీరంలో 50 శాతం మజిల్ మాస్, 7 శాతం బాడీ ఫ్యాట్ ఉన్నాయి. ఆహారం, నిద్ర, ట్రెయినింగ్.. ఇలా ప్రతిదాన్నీ శాస్త్రీయంగా ప్లాన్ చేసుకొని పాటించడం వల్లే ఇది సాధ్యమైంది’ అని సైంటిస్ట్ అలీ అల్ అహ్మదీ పేర్కొన్నారు. అవకాశం వస్తే రొనాల్డో మీద మరిన్ని పరిశోధనలు చేసి ప్రపంచానికి అందిస్తానని, అందరూ అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అది దోహదపడుతుందన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి