Share News

Ranji Trophy 2025: రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే

ABN , Publish Date - Jan 23 , 2025 | 08:01 PM

Rohit Sharma Failure: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమయ్యారు సరే దేశవాళీల్లోనైనా అదరగొడతారనుకుంటే ఇక్కడా తుస్సుమన్నారు. బ్యాటింగే రానట్లు.. పరుగులు చేయడం మర్చిపోయినట్లు ఆడుతూ వీళ్లేనా మన స్టార్లు అనే సందేహాలను కలిగించారు.

Ranji Trophy 2025: రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే
Rohit Sharma

3, 4, 4, 0, 1, 6, 10, 11, 12.. ఇదేదో ఫోన్ నంబర్ అనుకునేరు. అంతకంటే పొరపాటు లేదు. ఇది టీమిండియా స్టార్ల స్కోర్ కార్డు. అవును, నమ్మడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం. రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ వరకు ఆడిన పలువురు స్టార్ల బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లు ఇవి. టెస్ట్ క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతున్న భారత టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు రంజీల్లోనైనా రాణించి తిరిగి ఫామ్‌ను అందుకుంటారేమోనని అంతా భావించారు. కానీ తిరిగి అవే తప్పులు చేస్తూ అనామక బౌలర్ల చేతుల్లో ఔటై మరిన్ని విమర్శల్ని మూటగట్టుకుంటున్నారు.


నిలబడేందుకే భయపడ్డారు!

ఎన్నో అంచనాల మధ్య రంజీ బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన హిట్‌మ్యాన్ 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఓ అనామక బౌలర్ వేసిన డెలివరీకి పుల్ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. తన బలంగా చెప్పే పుల్ షాట్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. అటు డిఫెన్స్ సరిగ్గా చేయలేక.. ఇటు షాట్లు ఆడలేక క్రీజులో అసౌకర్యంగా కదిలాడు. మరో ఓపెనర్ జైస్వాల్ (4) కూడా ఇలాగే వికెట్ పారేసుకున్నాడు.


అప్పుడే చేయాల్సింది!

శుబ్‌మన్ గిల్ (4), అజింక్యా రహానె (12), శ్రేయస్ అయ్యర్ (11), రుతురాజ్ గైక్వాడ్ (10) కూడా తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. రజత్ పాటిదార్ (0), రిషబ్ పంత్ (1), ఛటేశ్వర్ పుజారా (6) కూడా అదే దారిలో నడిచారు. డొమెస్టిక్ బ్యాటర్లు దుమ్మురేపుతున్న చోట.. టీమిండియా స్టార్ల ఫ్లాఫ్ షోపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇది వాళ్ల తప్పు కాదు.. అసలు మిస్టేక్ బీసీసీఐదేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఆటగాడు దేశవాళీల్లో రాణించాలనే రూల్ రెండు, మూడేళ్ల కిందే తీసుకురావాల్సిందని.. అప్పుడే ఈ పని చేసి ఉంటే ఆసీస్, కివీస్ చేతుల్లో ఓటములు, ఇప్పుడీ ఫోన్ నంబర్ తరహా స్కోర్ కార్డ్ చూసేవాళ్లం కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇకనైనా దేశవాళీ ఆటతీరును కొలమానంగా తీసుకొని స్క్వాడ్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.


ఇవీ చదవండి:

ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం

సారీ చెప్పిన అర్ష్‌దీప్.. మ్యాటర్ ఏంటో తెలిస్తే నవ్వాగదు

కోహ్లీని భయపెడుతున్న సూర్య.. అనుకున్నదే అవుతోంది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 23 , 2025 | 08:07 PM