Share News

Gautam Gambhir: గంభీర్‌కు ఫుల్ పవర్స్.. అంతా కీలుబొమ్మలేనా..

ABN , Publish Date - May 14 , 2025 | 11:27 AM

Team India: భారత జట్టులో ఇక ఒకే వ్యక్తి హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ కల్చర్‌కు అడ్డాగా మారిన టీమిండియాలో ఇకపై కోచ్ ఏకఛత్రాధిపత్యం చలాయించడం పక్కా అని తెలుస్తోంది. అతడికి బోర్డు నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో అంతా తానై జట్టును శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

Gautam Gambhir: గంభీర్‌కు ఫుల్ పవర్స్.. అంతా కీలుబొమ్మలేనా..
Gautam Gambhir

భారత జట్టులో స్టార్ కల్చర్ ఎక్కువనేది దాదాపుగా అందరూ ఒప్పుకునే విషయం. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్ జమానా నుంచి ఇదే వస్తోంది. జట్టులో కెప్టెన్, సీనియర్ ప్లేయర్లు ఏం చెబితే అదే ఫైనల్. నిన్న మొన్నటి వరకు ఇదే నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. ఆటగాళ్లను దాటి హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు టీమ్‌పై పట్టుబిగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల వైఫల్యంతో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్టుల్లో నుంచి తప్పుకున్నారు. దీంతో జూనియర్ ఆటగాళ్లతో నిండిన టీమిండియాను గంభీర్ శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. అతడికి బోర్డు ఫుల్ పవర్స్ ఇచ్చిందని తెలుస్తోంది. దీని గురించి మరింతగా చూద్దాం..


పట్టు చిక్కినట్టే..

టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న రోహిత్-కోహ్లీ.. టెస్టులకూ గుడ్‌బై చెప్పేశారు. కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ సీనియర్లు.. వన్డేల్లో ఎక్కువ కాలం కొనసాగడం అనుమానమే. రోహిత్ నిష్క్రమణతో టెస్టుల్లో శుబ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడం దాదాపుగా ఖాయమని వినిపిస్తోంది. గంభీర్ మాటను గిల్ కాదనే సాహసం చేయకపోవచ్చు. జట్టులోని ఇతర సీనియర్లలో జడేజా ఎక్కువ కాలం ఆడే అవకాశాలు తక్కువే. గాయాలతో సావాసం చేసే బుమ్రా నిలకడగా ఆడటం కష్టమే. రాహుల్ ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేం. ఈ నేపథ్యంలో కుర్ర ఆటగాళ్లతో కూడిన భారత జట్టుపై గంభీర్‌కు పూర్తిగా పట్టు చిక్కడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు.


మాటే శాసనం..

టీమిండియాలో గౌతీ ఏదంటే అదే ఫైనల్ అని.. అతడి మాటే టీమ్‌కు శాసనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్స్ చెబుతున్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా గంభీర్ కనుసన్నల్లోనే నడుస్తారని అంటున్నారు. గంభీర్‌కు చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ సహా బీసీసీఐ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నందున.. మేనేజ్‌మెంట్‌లోని మిగిలిన వాళ్లంతా కీలుబొమ్మలేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గంభీర్ శకం మొదలవుతోందని.. ఇక జట్టు గెలుపోటములకు పూర్తి బాధ్యత అతడిదేనని అంటున్నారు.


ఇవీ చదవండి:

ఐపీఎల్‌కు బిగ్ షాక్‌

కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే

ఎస్‌ 400లు ఇంకా కావాలి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 11:41 AM