Share News

Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం

ABN , Publish Date - Nov 11 , 2025 | 08:04 AM

రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఏపీ నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విశాఖ పట్నం వేదికగా సోమవారం జరిగిన తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో నాలుగు వికెట్ తేడాతో ఏపీ జట్టు విజయం సాధించింది

Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం
Andhra vs Tamil Nadu

రంజీ ట్రోఫీ(Ranji Trophy 2025)లో పటిష్టమైన తమిళనాడుపై ఆంధ్ర జట్టు ఘన విజయం సాధించింది. గ్రూప్ -ఏ లో భాగంగా సోమవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో ఏపీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పటిష్టమైన తమిళనాడు జట్టుపై తమ అజేయ రికార్డును ఆంధ్ర జట్టు నిలబెట్టుకుంది.


రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు(Tamil Nadu) జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఏపీ నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విశాఖ పట్నం వేదికగా సోమవారం జరిగిన తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటారు. సోమవారం ఆటలో 7 వికెట్లు పడగొట్టిన ఆంధ్ర(Andhra Team) జట్టు... బ్యాటింగ్‌లో 201 పరుగుల టార్గెట్ ఛేదించి మూడే రోజుల్లో మ్యాచ్‌ను ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 102/3తో మూడో రోజు(సోమవారం) రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు 70.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో సౌరభ్‌ (4/46), విజయ్‌ (2/16), పృథ్వీరాజ్‌ (2/31) తమిళ నాడు కీలక బ్యాటర్లను ఔట్ చేసి.. దెబ్బకొట్టారు.


తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల ఆధిక్యం ఉన్న తమిళనాడు జట్టు... 201 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టుకు నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు(Andhra Win) 41.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆంధ్ర స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయినా... అశ్విన్‌ హెబ్బర్‌ (21*), సత్యనారాయణ రాజు (20*) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ నెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో జార్ఖండ్‌(Jharkhand)తో ఆంధ్ర జట్టు తలపడనుంది.

Updated Date - Nov 11 , 2025 | 08:04 AM