Share News

Medak Stadium Left Abandoned: అటే పాయె!

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:52 AM

ఒకప్పుడు 80 మందికిపైగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌ అకాడమీలతో ఒక వెలుగు వెలిగిన మెదక్‌ అవుట్‌డోర్‌ స్టేడియం ఇప్పుడు కనీస సౌకర్యాలు లేక వెలవెలబోతుంది....

Medak Stadium Left Abandoned: అటే పాయె!

  • నిరుపయోగంగా రూ. 5.5 కోట్ల సింథటిక్‌ ట్రాక్‌

మెదక్‌ (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు 80 మందికిపైగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌ అకాడమీలతో ఒక వెలుగు వెలిగిన మెదక్‌ అవుట్‌డోర్‌ స్టేడియం ఇప్పుడు కనీస సౌకర్యాలు లేక వెలవెలబోతుంది. 2000వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో స్థానిక మంత్రి కరణం రామచంద్రరావు కృషితో ఈ స్టేడియం నిర్మించారు. ఇందులో తొలుత బాక్సింగ్‌ అకాడమీని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌), అథ్లెటిక్స్‌ అకాడమీని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) నిర్వహించేవి. 2003-2004లో ఇక్కడి బాక్సింగ్‌ అకాడమీని హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత 2018 వరకు సాయ్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌ అకాడమీని నడిపారు. ఖేలో ఇండియా నిధుల కింద 2018లో సింథటిక్‌ ట్రాక్‌ వేసేందుకు మెదక్‌ స్టేడియానికి రూ.5.5 కోట్ల నిధులను సాయ్‌ మంజూరు చేసింది. సింథటిక్‌ ట్రాక్‌ పనులు మొదలయ్యాక ప్రాక్టీసు చేయడానికి ఇబ్బంది అవుతోందని అకాడమీని తాత్కాలికంగా హైదరాబాద్‌కు తరలించారు. 2019లో ఎనిమిది లేన్ల సింథటిక్‌ ట్రాక్‌ పనులు పూర్తయ్యాక తిరిగి అకాడమీ కార్యకలాపాలను ప్రారంభించాలని లేఖ రాయగా, హాస్టల్‌ భవనంతో పాటు ఇతర్రతా సదుపాయాలు కూడా ఆధునికీకరించాలని సాయ్‌ నుంచి స్పందన వచ్చింది. దానికి తగ్గట్టుగా సుమారు రూ.1 కోటి 43 లక్షలు వెచ్చించి దశల వారీగా ఆధునికీకరణ పనులు చేపట్టారు. తొలుత రూ.70 లక్షలతో పెయింటింగ్‌, విద్యుత్‌, మరుగుదొడ్లు, ఫ్లోరింగ్‌, తలుపులు, కిటికీల ఏర్పాటుతో పనులు పూర్తి చేశారు. తర్వాత సింథటిక్‌ ట్రాక్‌ చుట్టూ రూ.18 లక్షలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు, ట్రాక్‌ మధ్యలో రూ.40 లక్షలతో ఫుట్‌బాల్‌ మైదానం అభివృద్ధి, రూ.15 లక్షలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేశారు.


సాయ్‌ స్పందన ఏదీ..?

సింథటిక్‌ ట్రాక్‌ వేయకముందు అథ్లెటిక్స్‌ అకాడమీలో 36 మంది క్రీడాకారులు ఉండేవారు. ఓ ప్రధాన కోచ్‌ సహా ఏడుగురు సాయ్‌ సిబ్బంది విధులు నిర్వర్తించేవారు. కానీ, తాత్కాలికంగా హైదరాబాద్‌కు తరలించిన అకాడమీ.. ఆధునికీకరణ పనులు చేపట్టాక మాత్రం తిరిగి సొంతగూటికి రాలేకపోవడం గమనార్హం. అకాడమీని మళ్లీ మెదక్‌కు తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ స్థాయిలో ఎన్ని లేఖలు రాసినా సాయ్‌ నుంచి స్పందన లేదు. 2023లో సాయ్‌-బెంగళూరు కేంద్రం రీజనల్‌ డైరెక్టర్‌ రీతూ పాఠక్‌ మెదక్‌ కేంద్రాన్ని సందర్శించి అథ్లెటిక్స్‌తో పాటు ఫుట్‌బాల్‌ అకాడమీలను ఇక్కడ ప్రారంభించడానికి అనువైన సదుపాయాలున్నాయని సంతృప్తి వ్యక్తం చేసినా, అందుకు తగ్గట్టు అడుగులు పడలేదు. ఇక్కడ ఫుట్‌బాల్‌ అకాడమీ కోసం మెదక్‌ ఫుట్‌బాల్‌ సంఘం.. సాయ్‌ పెద్దలను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకపోయింది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..!

ప్రస్తుతం మెదక్‌ అవుట్‌డోర్‌ స్టేడియంలో వాచ్‌మన్‌ కమ్‌ గ్రౌండ్స్‌మన్‌ మినహా ఎవరూ కనిపించరు. దీంతో స్టేడియం లోపల పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. సింథటిక్‌ ట్రాక్‌కు కొన్ని చోట్ల పగుళ్లు రాగా, మరికొన్ని ప్రదేశాల్లో ఉబ్బిపోయింది. 80 మందికి వసతి గల హాస్టల్‌ భవంతి నిరూపయోగంగా మారిపోయింది. స్టేడియం పూర్తిగా కళావిహీనంగా మారిందని క్రీడాకారులు, వాళ్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం వాడుకలో లేకపోవడంతో రాత్రివేళ్లలో ఇక్కడ ఆకతాయిలు మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

1.jpg

శాట్‌కుబాధ్యత లేదా?

హైదరాబాద్‌కు తరలించిన అకాడమీలను తిరిగి సొంతగూటికి తీసుకురావాల్సిన విషయంలో శాట్‌ కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాయ్‌తో శాట్‌ అధికారులు సంప్రదించి ఈ విషయంలో పరిష్కారం చూపించాల్సిన అవసరముంది. ఒకవేళ సాయ్‌ స్పందించకపోతే.. ఇక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌ అకాడమీలను శాట్‌ స్వయంగా ప్రారంభించాలని క్రీడాకారులు కోరుతున్నారు. తక్షణమే కోచ్‌లతో పాటు ఇతర సహాయ సిబ్బందిని నియమించి మెదక్‌ అవుట్‌డోర్‌ స్టేడియంకు పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:52 AM