Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:51 AM
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీవో వద్ద రిజిస్ట్రర్ చేశారని కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.
ఢిల్లీ, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన ( Delhi Blast incident)తో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిదిమంది మృతిచెందగా, పలువురికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌కు 15 మంది క్షతగాత్రులని తరలించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. నిన్న(సోమవారం) సాయంత్రం 6:52 గంటలకు పేలుడు ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటనలో 24 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు తెలిపారు.
పేలుడు ధాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ20 కారు నిలిపి ఉంచారని వివరించారు. ఈ కారు నిన్న మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్లు గుర్తించారు. ఐ20 కారు నిన్న సాయంత్రం 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరిందని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించిందని పేర్కొన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీవో వద్ద రిజిస్ట్రర్ చేశారని వెల్లడించారు. ఈ కారు HR26CE7674 రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉందని తెలిపారు. ఈ కారు మహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్ట్రర్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో మహ్మద్ సల్మాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించామని తెలిపారు. ఐ20 కారుని తారిక్ పుల్వామా నివాసికి అమ్మేసినట్లు మహ్మద్ సల్మాన్ తెలిపారని అన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన కారులో ఉన్న వ్యక్తి వైద్యుడైన మహ్మద్ ఉమర్ అయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనకి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు.
ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కారు బాంబు పేలిన సంఘటన స్థలంలో క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. ఎర్రకోట పరిసర ప్రాంతంలో పూర్తిగా మెట్రోలను మూసివేశారు అధికారులు. ఢిల్లీలోని పర్యటక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కేసుని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..
ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి