Dolo 650 Overuse: డోలో 650ని జెమ్స్‌లా తినేస్తున్నారు.. డాక్టర్ షాకింగ్ పోస్ట్..
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:20 PM
Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Doctor Viral Post About Dolo 650: కొవిడ్ ముందు వరకూ డోలో 650 గురించి జనాలకు పెద్దగా తెలియదు. అప్పటివరకూ జ్వరం వచ్చినపుడు డాక్టర్ దగ్గరకు పరిగెత్తే పేషెంట్లు ఇప్పుడు నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి డోలో 650 కొనేస్తున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, జలుబు ఇలా అన్నింటికి ఇదే మందు అని ఎవరికి వారే సొంతంగా నిర్ణయం తీసేసుకుని సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ ధోరణి భారతీయుల్లో వేగంగా పెరుగుతుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. డాక్టర్లను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్లుగా పిప్పరమెంట్లలాగా డోలో 650 ని మింగేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఫన్నీగా, ఘాటుగా చెప్తూ ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
సెల్ఫ్ మెడికేషన్ మంచిది కాదు: డాక్టర్లు
సాధారణంగా ఇండియాలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పగానే డాక్టర్లు డోలో 650 ని సూచిస్తారు. అందుకని ఆ లక్షణాలు కనిపించిన ప్రతిసారీ జనాలు అదే మందు వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ, డోలో 650ని మోతాదుకు మించి తీసుకుంటే అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు.. ప్రధానంగా కాలేయంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని చాలామందికి తెలియదు. అందుకని డాక్టర్ కూడా ఇదేగా ఇస్తాడని గుడ్డిగా వేసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి పది మందిలో 5 మంది వైద్యుడిని సంప్రదించకుండానే డోలో 650 వాడేస్తున్నారు. కొవిడ్ సమయంలో టీకా వేసుకున్న తర్వాత డాక్టర్లు ప్రజలకు పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పినప్పటి నుంచి భారతీయుల్లో ఈ అలవాటు ఊపందుకుంది. వైద్యుల సలహా, సిఫార్సు లేకుండా మోతాదుకు మించి ఈ ఔషధాన్ని వాడితో ఎంత ప్రమాదమో అవగాహన లేకపోవడమే దీనికి కారణం.
డోలో 650 ఏమైనా క్యాడ్‌బరీ జెమ్సా..
ఈ ధోరణిని విమర్శిస్తూ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆరోగ్య విద్యావేత్త పళనియప్పన్ మాణిక్యం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. "భారతీయులు డోలో 650 ని క్యాడ్‌బరీ జెమ్స్ లాగా తినేస్తున్నారని" చేసిన చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డోలో-650 టాబ్లెట్‌లో పారాసెటమాల్ ఉంటుంది. ఇది నొప్పి, మంట, జ్వరం కలిగించే ప్రోస్టాగ్లాండిన్ విడుదలను నిరోధిస్తుంది. జ్వరం వచ్చిన సందర్భాలలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఫోర్బ్స్ ప్రకారం 2020లో కొవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి మైక్రో ల్యాబ్స్ 350 కోట్లకు పైగా డోలో-650 టాబ్లెట్‌లను విక్రయించింది, దీని ద్వారా ఏడాదికి రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది. మహమ్మారి ప్రారంభమయ్యే ముందు మైక్రో ల్యాబ్స్ ఏటా దాదాపు 7.5 కోట్ల డోలో-650 స్ట్రిప్‌లను విక్రయించిందని మార్కెట్ పరిశోధన సంస్థ IQVIA తెలిపింది. ఒక సంవత్సరం తర్వాత అది 9.4 కోట్ల స్ట్రిప్‌లకు పెరిగింది. 2021 చివరి నాటికి 14.5 కోట్ల స్ట్రిప్‌లను తాకింది. ఇది 2019 సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. ఈ లెక్కలను బట్టే అర్థం చేసుకోవచ్చు. కొవిడ్ తర్వాత నుంచి డోలో 650 వినియోగించే వారి సంఖ్య ఎంతలా పెరిగిందో.
Read Also: Viral Video: ఫ్రిడ్జ్ వాటర్ కదా అని తాగేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే వాంతులు చేసుకుంటారు..
Viral Video: ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటున్న వ్యక్తి.. సమీపానికి వెళ్లిన యువతి.. గ్యాలరీలో చూడగా..