Share News

TANA 24th Conference: తానా ముగింపు వేడుకల్లో సమంత జోష్.. అదిరిపోయిన తమన్‌ సంగీతం

ABN , Publish Date - Jul 07 , 2025 | 07:17 AM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌‌లో జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగింది.

TANA 24th Conference: తానా ముగింపు వేడుకల్లో సమంత జోష్..  అదిరిపోయిన తమన్‌ సంగీతం
TANA 24th Conference

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వై వార్షిక మహాసభలు (TANA 24th Conference) డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌‌లో జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగింది. మహాసభల చివరి రోజున క్రేజీ హీరోయిన్‌ సమంత (Samantha) రాకతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. మరోవైపు తమన్‌ సంగీత విభావరితో (Thaman Musical Concert) దద్దరిల్లిపోయింది. చివరిరోజు వేడుకలను తిలకించేందుకు దాదాపు 15వేలమందికిపైగా వచ్చారు. ఆటలు, పాటలు, సంగీత విభావరులు, సినిమా స్టార్‌‌ల మాటలు, మెరుపులు, రాజకీయ నాయకుల ప్రసంగాలు వెరసి తానా మహాసభలు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ముగిసింది.

TANA 24th Conference


చివరిరోజున కూడా పలు కార్యక్రమాలు జరిగాయి. జానపద నృత్యాలు, పాటలు, మహాసభల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచిన టీమ్‌లకు అవార్డులు బహుకరించారు. అమెరికాలోని యూత్‌‌తో సినిమా నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన గోపికా నృత్యం, గజేంద్రమోక్షం నాటకం, శ్రీవారి వైభవం నృత్యరూపకం, హైదరాబాద్‌లోని అక్షర గ్రూపు ప్రదర్శించిన నందకిషోరుడు శాస్త్రీయ నృత్యం, కృష్ణం వందే జగద్గురుమ్‌ ఫ్యూషన్‌ డ్యాన్స్‌, మోహినీ భస్మాసుర నృత్యరూపకం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇంద్రనీల్‌ శివతాండవం ఆకట్టుకుంది. మీట్‌ అండ్‌ గ్రీట్‌ పేరుతో మహాసభలకు వచ్చిన సినీనటీనటులతో కార్యక్రమం జరిగింది. ఐశ్వర్యరాజేష్‌, నిఖిల్‌ సిద్ధార్థ పాల్గొన్నారు.

tanaa.jpg


సమంత రాకతో...

ఈ కార్యక్రమానికి స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. తనకు ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన సమంత.. తను ప్రతి ఏడాది తానా గురించి వింటూనే ఉన్నాననని చెప్పుకొచ్చారు. ‘ఏ మాయ చేశావే’ చిత్రం నుంచే తమలో ఒకరిగా చూసిన తెలుగు వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా తెలుగు వారు ఏమనుకుంటారు? అనే ఆలోచిస్తానని చెప్పారు. ‘నాకు ఒక ఐడెంటిటీ, ఒక ఇల్లు.. నేను ఇక్కడే ఉండాలనే ఫీలింగ్‌ అందించింది మీరే’ అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన ‘ఓ బేబీ’ చిత్రం అమెరికాలో మిలియన్‌ డాలర్లు కలెక్షన్‌ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని, ఆ సమయంలో ఎంతో దూరంగా ఉన్నా అమెరికాలోని తెలుగు వారంతా తన మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నారని పేర్కొన్నారు.

TANA 24th Conference


కొత్త టీమ్‌

మహాసభల చివరిరోజున తానా కొత్త ప్రెసిడెంట్‌‌గా నరేన్‌ కొడాలి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌, కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులు, ఫౌండేషన్‌ టీమ్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనివాస్‌ లావు (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), సునీల్‌ పంత్రా (సెక్రటరీ), వెంకట(రాజా) కసుకుర్తి (ట్రజరర్‌), లోకేష్‌ కొణిదెల (జాయింట్‌ సెక్రటరీ), రాజేష్‌ యార్లగడ్డ (జాయింట్‌ ట్రజరర్‌), కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి (ఇంటర్నేషనల్‌ కోర్డినేటర్‌), మాధురి ఏలూరి (హెల్త్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌), నాగ మల్లేశ్వరరావు పంచుమర్తి (స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ కో ఆర్డినేటర్‌), పరమేష్‌ దేవినేని (మీడియా కోఆర్డినేటర్‌), సాయి బొల్లినేని (కమ్యూనిటీ సర్వీస్‌ కోఆర్డినేటర్‌), సోహ్ని అయినాల (ఉమెన్స్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌), సాయిసుధ పాలడుగు (కల్చరల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌), సునీల్‌ కాంత్‌ దేవరపల్లి (సోషల్‌ వెల్ఫేర్‌ కో ఆర్డినేటర్‌), శివలింగ ప్రసాద్‌ చావా (స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌), వెంకట్‌ అడుసుమిల్లి (ఎడ్యుకేషన్‌ కో ఆర్డినేటర్‌), వెంకట్‌ సింగు (బెనిఫిట్స్‌ కో ఆర్డినేటర్‌)గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఫౌండేషన్‌ ట్రస్టీలుగా శ్రీకాంత్‌ దొడ్డపనేని, కిరణ్‌ దుగ్గిరాల, త్రిలోక్‌ కంతేటి, సతీష్‌ కొమ్మన, దేవేంద్ర రావు లావు, ఠాగూర్‌ మల్లినేని, సతీష్‌ మేకా, శ్రీనివాస్‌ ఓరుగంటి, మధుకర బి. యార్లగడ్డ, ఫౌండేషన్‌ డోనర్‌ ట్రస్టీలుగా శ్రీనివాస్‌ చంద్‌ గొర్రెపాటి, ప్రసాద నల్లూరి, బోర్డ్‌ డైరెక్టర్లుగా వెంకట్‌ కోగంటి, భరత్‌ మద్దినేని, జనార్ధన్‌ నిమ్మలపూడి, అనిల్‌ చౌదరి ఉప్పలపాటి, నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి బాధ్యతలు చేపట్టారు.

TANA 24th Conference


మురళీమోహన్‌, బీఆర్‌ నాయుడులకు అవార్డులు

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మురళీమోహన్‌కు తానా జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ బి.ఆర్‌. నాయుడుకు తెలుగుతేజం అవార్డుతో సత్కరించారు. బిఆర్‌ నాయుడు రాలేకపోవడంతో ఆయన బదులు టీవీ5 మూర్తి అందుకున్నారు. ఎల్‌.వి. ప్రసాద్‌ అవార్డును కూడా ఆయన మనవరాలు రాధ అందుకున్నారు. ధర్మారావుకు సంస్కృతీ రత్న అవార్డును బహుకరించారు.

TANA 24th Conference


దద్దరిల్లిపోయిన తమన్‌ సంగీత విభావరి

మహాసభల చివరిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ సంగీత విభావరి జరిగింది. సూపర్‌ హిట్‌ చిత్రాల్లోని పాటలకు ఆయన వేసిన సంగీతం వచ్చినవారిని ఉర్రూతలూగించింది. పాటలు, సంగీతానికి ఎంతోమంది డ్యాన్స్‌లు చేయడం విశేషం. ఇలా ఎన్నో కార్యక్రమాలతో మూడురోజులపాటు తానా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సభలు 5వ తేదీన ముగిశాయి. ఈ మహాసభలను విజయవంతం చేసిన అందరికీ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాదెళ్ల, కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌, సునీల్‌ పంట్ర, కిరణ్‌ దుగ్గిరాల, జో పెద్దిబోయిన తదితరులు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు చదవండి:

నాట్స్ సంబరాలు..టాంపాలో ‘పుష్ప’

టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

Read Latest and NRI News

Updated Date - Jul 07 , 2025 | 07:23 AM