TANA 2025 Conference: ప్రత్యేకంగా తానా 24వ మహాసభలు.. పాల్గొనే అతిథులు వీరే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 08:03 AM
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్ వేదికైంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగనున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు (TANA 2025 Conference) ఈసారి డెట్రాయిట్ (Detroit) వేదికైంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగనున్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లు పూర్తయిందని, అతిథులు వస్తున్నారని కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ గాయని చిత్రతో సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఉదయ్ కుమార్ చాపలమడుగు.
సినీ నేపథ్య గాయకురాలు సునీత, గాయకుడు ఎస్ పీబీ చరణ్‌తో కూడా లైవ్ మ్యూజిక్ కార్యక్రమం ఉంటుందని, వీరితోపాటు నేపథ్య గాయనీ గాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో సందడి చేస్తారని ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ మహాసభలకు హాజరవుతారని చెప్పారు. తెలుగు కమ్యూనిటీ మహాసభలకు ఆమె రావడం ఇదే మొదటిసారని వెల్లడించారు. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కూడా హాజరవుతున్నారని చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొన్నారు ఉదయ్ కుమార్ చాపలమడుగు.
అన్నమాచార్య స్వరార్చన పేరుతో శ్రీమతి శోభారాజు కార్యక్రమం కూడా ఉంటుందని ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. ఈ మహాసభలకు సినిమా, సాహిత్యం, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. మహాసభలకు సాధారణ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జులై 4, 5వ తేదీ వరకు జరుగుతుంటాయని వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకోసం అక్కడికి సమీపంలో ఉన్న హోటళ్లలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. కాన్ఫరెన్స్‌కు వచ్చే అతిథులు, ఇతరులకోసం ఆతిథ్య ఏర్పాట్లను అందరికీ సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. ఎంతోమంది వస్తున్న ఈ తానా మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఉదయ్‌కుమార్ చాపలమడుగు కోరారు.
ఇవీ చదవండి:
అట్లాంటాలో తానా పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతం
ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్నహస్తం.. సౌదీలో మానవత్వం చాటుకున్న తెలుగు మహిళ