Share News

Asaram Bapu: రేప్ కేసు దోషి ఆశారాంకు.. సుప్రీంలో మధ్యంతర బెయిలు..

ABN , Publish Date - Jan 07 , 2025 | 02:27 PM

2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. స్వయంగా తాను దైవమని ప్రకటించుకున్న ఆశారాం అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలానీ.. రెండు రేప్ కేసుల్లో దోషిగా రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.

Asaram Bapu: రేప్ కేసు దోషి ఆశారాంకు.. సుప్రీంలో మధ్యంతర బెయిలు..
Asaram Bapu

2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 86 ఏళ్ల ఆశారాంకు వైద్యకారణాలతో జోధ్‌పూర్‌ అత్యాచారం కేసులో 2025 మార్చి 31 వరకు బెయిలుపై విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం (జనవరి 7)నాడు తీర్పు వెలువరించింది. బెయిలుపై బయటకు వెళ్లాక సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన అనుచరులను కలవకూడదని..న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ఆశారాంను ఆదేశించింది. డిసెంబర్ 18, 2024న నుంచి 17 రోజుల పెరోల్ పూర్తయిన తర్వాత ఇటీవల జనవరి 2న మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలుకు తిరిగి వచ్చాడు ఆశారాం. పెరోల్‌పై విడుదలైన సమయంలో పూణేలో ఉంటూ వైద్య చికిత్స చేయించుకున్నాడు. స్వయంగా తాను దైవమని ప్రకటించుకున్న ఆశారాం అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలానీ.. రెండు రేప్ కేసుల్లో దోషిగా రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.


తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాంకు బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరడంతో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆశారాంను వెంటనే ఆసుపత్రికి తరలించాలని, చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది.


ఆగష్టు 29, 2024న సస్పెన్షన్‌ కోరుతూ ఆశారాం చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. 2013లో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆశారాంకు 2018లో జీవిత ఖైదుగా శిక్ష పడింది. 2023లో ఆశారాం బాపూ మరో అత్యాచార కేసులోనూ దోషిగా తేలారు. 2013లో గుజరాత్‌ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో ఆశారాం పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Updated Date - Jan 07 , 2025 | 02:29 PM