Share News

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:39 AM

పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

  • కీళడి నాగరికతపై ఎడతెగని వివాదం

  • ఆ నాగరికత 2,800 ఏళ్లకన్నా ముందటిదని పరిశోధనల్లో తేలిందంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం

  • అందులో తప్పులున్నాయంటూ నిలిపేసిన కేంద్రం

  • సాక్ష్యంగా పురావస్తు శాఖ తవ్వకాల నివేదిక

  • ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావజాలాన్ని తోసిరాజ నేలా ఉందనే తొక్కిపెడుతున్నారని మండిపాటు

  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ‘నాగరికత’

చెన్నై, జూలై 6(ఆంధ్రజ్యోతి): పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వారు వెలుగులోకి తెచ్చిన కీళడి నాగరికత, అది కొనసాగిన కాలం విషయంలో ఆ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎడతెగని వివాదం నెలకొంది. కీళడి తవ్వకాలలో లభించిన ప్రాచీన వస్తువులు, నగర శిథిలాలను బట్టి అక్కడి తమిళుల నాగరికత కాలం 2,800 సంవత్సరాలకు మునుపటిదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా.. అది 2,300 ఏళ్ల మునుపటిదేనని కేంద్రం అంటోంది. అంతేకాదు కీళడి నాగరికతకు సంబంధించి భారత పురాతత్వ శాఖ (ఏఎస్‌ఐ) రూపొందించిన నివేదికను పక్కన పెట్టింది. దీనిపై తమిళ రాజకీయపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావజాలానికి, వారు చెప్పే సిద్ధాంతాలను తోసిరాజనేలా కీళడి నాగరికత ఉండటంతోనే వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


‘కీళడి నాగరికత’ ఏంటి?

తమిళనాడులోని మదురై ప్రాచీన నగరం. తమిళ సాహిత్యానికి, సంస్కృతికి పుట్టినిల్లు. ఆ నగరం చుట్టూ తమిళ శిలా శాసనాలు, కుడ్య శాసనాలు, తిరుప్పరంకుండ్రం, అళగన్‌కుళం శాసనాలు వంటివెన్నో లభించాయి. ఈ క్రమంలో మదురై చేరువగా తమిళ ప్రాచీన నాగరికత ఆనవాళ్లు ఉండవచ్చన్న ఆలోచనతో ఆ రాష్ట్ర పురావస్తు శాఖ 2014లో తవ్వకాలు చేపట్టింది. అక్కడి వైగై నది తీరాన ప్రాచీన కట్టడాలు, నీటి కాలువలు, చేనేత పరిశ్రమకు సంబంధించిన ఆనవాళ్లు, కుండలు, పెంకులు, ఆభరణాలు వంటివెన్నో బయటపడ్డాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. కీళడిలో నగర నాగరికత 2,800 సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించిందని పేర్కొంది. మరోవైపు కీళడిలో భారత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ)కి చెందిన అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం కూడా తవ్వకాలు జరిపి 2,800 సంవత్సరాలకు పూర్వం ఈ నాగరికత ఆవిర్భవించిందని, క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో అంటే 2,500 సంవత్సరాలకు ముందు విస్తరించిందని పేర్కొంది. రామకృష్ణన్‌ బృందం 2,800 సంవత్సరాలకు పూర్వమే ఈ నాగరికత ఆవిర్భవించిందని పేర్కొన్నా.. అది విస్తరించిన కాలాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం వివాదానికి దారితీసింది.


500 సంవత్సరాలకు కోత పెట్టి!

అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ నివేదిక, కీళడిలో లభ్యమైన వస్తువులను బట్టి చూస్తే తమిళుల నాగరికత కాలం 2,300 సంవత్సరాల క్రితం నాటిది మాత్రమేనని అవగతమవుతోందని కేంద్రం పేర్కొంది. ఈ నాగరికత కాలాన్ని 500 సంవత్సరాలు తగ్గించాలని సూచించింది. అయితే కీళడి వద్ద తవ్వకాలు, పురాతన ఆధారాల గుర్తింపు అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చేపట్టామని, ఆ వస్తువులన్నీ ఏ కాలానికి చెందినవో పరిశోధకులు నిర్ధారించారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. కీళడి పురావస్తు పరిశోధనలపై ఏఎస్‌ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ సమర్పించిన నివేదికలను అధికారికంగా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేసింది. ‘‘పురావస్తు తవ్వకాల్లో లభించే పెంకులు, బంగారం, వెండి, ఇనుము వంటి వస్తువులు ఎన్నేళ్ల క్రితం నాటివో క్షణాల్లో తేల్చి చెప్పగల స్కానింగ్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి ఈ వస్తువుల కాలాన్ని తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా స్కానింగ్‌ చేసి నిర్ధారించాం. అశోక చక్రవర్తి గురించి పుస్తకాల్లో చదువుకుంటున్నాం.


చెట్లు నాటారని, ధర్మసత్రాలు కట్టారని చదువుతున్నాం. అసలు అశోకుడి పేరుతో ఓ రాజు ఉండేవాడని లోకానికి తొలుత తెలియజేసింది జేమ్స్‌ ప్రిట్సప్‌ అనే చరిత్రకారుడే. ఆ చరిత్రకారుడు కనుగొని చెప్పినదే తమిళ బ్రహ్మీ లిపి. అన్ని నాగరికతల కంటే తమిళుల నాగరికత అత్యంత ప్రాచీనమైనదని లోకానికి ఎలుగెత్తి చాటేందుకు సిద్ధమవుతున్నాం’’ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చారిత్రక పరిశోధకుడు బాలకృష్ణన్‌ చెప్పారు.

కీళడి నివేదికను ఆమోదించాల్సిందే: స్టాలిన్‌

సంగ సాహిత్యంలో వివరించిన జీవన విధానం కీళడి ఆవిష్కరణలతో శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. కీళడి పురావస్తు తవ్వకాలపై బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ జాన్‌ మూర్స్‌ విశ్వవిద్యాలయం తాజాగా నిర్వహించిన పరిశోధనలు కూడా తమిళుల సంస్కృతి ప్రాచీనతను గుర్తించాయని తెలిపారు. కేంద్రం ఏ మాత్రం జాప్యం చేయకుండా కీళడి తవ్వకాల నివేదికను ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. కీళడిలో లభించిన పుర్రెలను పరిశీలించిన జాన్‌మూర్స్‌ విశ్వవిద్యాలయం.. త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో 2,500 ఏళ్లకు పూర్వంనాటి ప్రజల ముఖకవళికలను పునర్నిర్మించటం పట్ల తాము గర్వపడుతున్నామని చెప్పారు. 5,300 ఏళ్లకు ముందే తమిళనాట ఇనుప, ఇతర లోహపు వస్తువులను ఉపయోగించేవారని పురావస్తు తవ్వకాల్లో వెల్లడైందని, దక్షిణ భారతం అప్పట్లోనే ఇనుప లోహాన్ని వాడేవారని నిర్ధారణ అయిందని స్పష్టం చేస్తున్నారు.


కీళడి నాగరికత కాలాన్ని 500 సంవత్సరాలు తగ్గించాలన్న కేంద్రం సూచనపై తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ మండిపడుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే సహా ప్రధాన పార్టీల నేతలంతా కేంద్రం తీరును తప్పుపడుతున్నారు. కీళడి నగర నాగరికతను సింధు నాగరికతతో పోల్చటాన్ని కేంద్రంలోని పాలకులు ఏ మాత్రం సహించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు.

విస్తృతంగా తవ్వకాలు: అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌

కీళడిలో మరింత విస్తృతంగా పరిశోధనలు జరపాలని సిఫార్సు చేశానని అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ తెలిపారు. వైగై వంటి చిన్న నది సమీపాన పెద్ద నాగరికతల ఆనవాళ్లు లభించడమేంటన్న విమర్శలు సరికాదని చెప్పారు. సింధు నాగరికత కూడా ఆ నదికే పరిమితం కాకుండా 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని.. ఇక్కడ వైగై నది నాగరికత కూడా చాలా విస్తరించి ఉండవచ్చని తెలిపారు. కీళడికి చేరువగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే ఆధారాలు బయటపడతాయని పేర్కొన్నారు.


సంగ సాహిత్యమే ఆధారం!

సింధు, హరప్పానాగరికతలకు సంబంధించి బయటపడిన పురాతన వస్తువులను పోల్చదగిన సాహిత్యం అంటూ ఏదీ లేదు. అయితే తమిళ సంగ సాహిత్యంలో వర్ణించిన నగరాలు, నివాసగృహాలు, ఆభరణాలు, పనిముట్ల వంటివి కీళడి తవ్వకాల్లో బయటపడ్డాయని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ రెండు విడతలుగా కీళడి వద్ద పురావస్తు తవ్వకాలను సమర్థవంతంగా నిర్వహించారని.. కానీ కేంద్రం ఆయనను మరో చోటికి బదిలీ చేసిందని గుర్తు చేస్తోంది. తర్వాత వచ్చిన ఏఎ్‌సఐ అధికారి.. తమిళ ప్రాచీన నగరాల నాగరికతకు సంబంధించి ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదని ప్రకటించి చేతులు దులుపుకొన్నారని పేర్కొంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పురావస్తు తవ్వకాలను కొనసాగించిందని.. తవ్వకాల్లో లభించిన పురాతన వస్తువులతో మ్యూజియం కూడా ఏర్పాటు చేశామని తెలిపింది.

Updated Date - Jul 07 , 2025 | 05:26 AM