Petrol Attack: బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి.. యువకుడిపై పెట్రోల్ పోసి..
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:40 PM
పుట్టిన రోజు పార్టీ పేరుతో పిలిచి.. ఐదుగురు స్నేహితులు ఓ యువకుడిపై పెట్రోల్ తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు పుట్టిన రోజునాడే చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.
ముంబై, నవంబర్ 26: నేటికాలంలో స్వచ్ఛమైన స్నేహం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కొందరు స్నేహితులుగా నటిస్తూ వెనుక గోతులు తవ్వుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో స్నేహితులే నమ్మించి ప్రాణాలు తీస్తుంటారు. ఇలా కొందరు కిరాత స్నేహితుల దాడిలో చనిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. మరికొందరు వారి దాడిలో గాయపడి.. జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా ఓ యువకుడిని.. పార్టీ పేరుతో పిలిచిన అతడి స్నేహితులు పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై(Mumbai birthday attack) నగరంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
ముంబై(Mumbai) నగరంలో అబుల్ రెహమాన్ మక్సూద్ అలం ఖాన్(21) తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం అతడి పుట్టిన రోజు కావడంతో కేక్ కట్ చేసేందుకు బయటకు రావాలని అతడి స్నేహితుల్లో ఒకడైన అయాజ్ మాలిక్ ఫోన్ చేశాడు. కాసేపటి తర్వాత మరొక స్నేహితుడు షరీఫ్ ఫోన్ చేసి.. అబుల్‌ను కోహినూర్ ఫేజ్ 3 సొసైటీలోని ఓ అపార్ట్మెంట్‌కు రమ్మని కోరాడు. అక్కడి వెళ్లిన అబుల్ కు అతడి స్నేహితులైన అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, ఖాసిం చౌదరి, హుజైఫా ఖాన్, షరీఫ్ షేక్ కేక్ తో అతనికి స్వాగతం పలికారు. ఇక అతడు కేక్ కట్ చేస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అబుల్ స్నేహితులు అందరూ అతనిపై రాళ్ళు విసిరారు. అంతేకాక అయాజ్ పెట్రోల్ బాటిల్ తెచ్చి అష్రఫ్ సహాయంతో అబుల్(friends attack)పై పోయడం ప్రారంభించాడు.
దీంతో ఒక్కసారిగా షాకైన అబుల్ వారిపై కేకలు వేశాడు. ఇదే సమయంలో మరో ముగ్గురు నిందితులు అబుల్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అబుల్ పారిపోవడానికి ప్రయత్నించగా.. అయాజ్ మాలిక్ తన లైటర్(friends betrayal)తో తగులబెట్టాడని బాధితుడు ఆరోపించారు. కొన్ని సెకన్లలోనే అబుల్ బట్టలు కాలిపోయాయి. ప్రాణాల కాపాడుకునేందుకు అతడు బయటకు వచ్చి సమీపంలోని కుళాయి దగ్గర నీటితో మంటలను ఆర్పుకున్నాడు. అయితే అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ముంబైలోని గురునానక్ ఖల్సా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అతడి ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, రెండు చేతులకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీం చంద్రబాబు