Narendra Modi: ఆ ఉగ్రమూకను వదిలిపెట్టం
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:08 AM
పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని భారతీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ తదితరులు దాడిని అమానవీయంగా మరియు దిగ్ర్భాంతికరంగా అభివర్ణించారు, ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సౌదీ నుంచి హుటాహుటిన ప్రధాని వెనక్కి
పహల్గాం దాడి క్రూరమైనది: ద్రౌపదీ ముర్ము
భారత్‌కు మా సంపూర్ణ మద్దతు: ట్రంప్
ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడదాం: ఖర్గే
కేంద్రం డొల్ల ప్రకటనలు కట్టిపెట్టాలి: రాహుల్
ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలి: రేవంత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: పహల్గామ్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, అమెరికా అద్యక్షుడు ట్రంప్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. అమాయకులైన పౌరులు, పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమని ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘పహల్గాం ఉగ్రదాడి దిగ్ర్భాంతికరం. ఇదొక క్రూరమైన, అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన’ని రాష్ట్రపతి పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామని, వారిని వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు.
ఉగ్రమూకల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనకు సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని.. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పర్యటనను కుదించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి సౌదీ ప్రభుత్వ అధికారిక విందులోనూ మోదీ పాల్గొనలేదు. బుధవారం ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉండగా.. మంగళవారం రాత్రే బయల్దేరుతున్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మచ్చ అని, ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ డొల్ల ప్రకటనలను కట్టిపెట్టి, బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి వార్త కలచివేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్, అర్జెంటినా దేశాలు కూడా తెలిపాయి.
కఠినంగా వ్యవహరించాలి: రేవంత్
పహల్గాం ఉగ్రదాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి దొంగదెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడి పాశవిక చర్య అని, దోషులను వదలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, దాడికి పాల్పడినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపడం అమానవీయ చర్య అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు ఉగ్రదాడిని ఖండించారు.
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..