Nimisha Priya: మరణ శిక్ష నుంచి తప్పించుకున్న నిమిష..! త్వరలో విడుదల..?
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:12 PM
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

KA Paul on Nimisha Priya: హత్య కేసులో యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ శిక్ష రద్దు చేశారు. ఈ విషయాన్ని క్రైస్తవ మత ప్రచారకుడు, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. యెమెన్ రాజధాని సనా నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. నిమిష త్వరలో భారతదేశానికి తిరిగి వస్తారని అన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, యెమెన్ నాయకులతో వరుసగా పది రోజులు పగలు, రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యెమెన్‌కు ధన్యవాదాలు: కేఏ పాల్
కేఏ పాల్ నిమిష ప్రియ విడుదలపై తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందరి ప్రార్థనలు, గత 10 రోజులుగా చేస్తున్న కృషి ఫలించి నిమిష ప్రియకు విధించిన మరణశిక్ష రద్దయిందని ప్రకటించారు. ఈ విజయానికి కారకులైన యెమెన్ నాయకులకు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేవుని దయవల్ల యెమెన్ రాజధాని సనా జైలు నుంచి నిమిష విడుదలై త్వరలో భారతదేశానికి రాబోతోందని వెల్లడించారు. నిమిషను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం దౌత్యవేత్తలను పంపించేందుకు అంగీకరించిందని తెలిపారు. ఆమెను సనా జైలు నుంచి స్వదేశానికి తెచ్చేందుకు భారత ప్రభుత్వం లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేసుకోవచ్చని అన్నారు.
కాగా, జులై 16న నిమిషకు విధించాల్సిన ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. కేరళ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబుబకర్ అహ్మద్ అప్పటి నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) యెమెన్‌లోని స్థానిక అధికారులతో నిరంతర చర్చలు జరుపుతోంది. సనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న నిమిష ప్రియకు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సున్నిత విషయంలో ప్రియ కుటుంబానికి చట్టపరమైన సహాయం చేయడానికి MEA ఒక న్యాయవాదిని నియమించిందని ప్రభుత్వ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. షరియా చట్టం ప్రకారం క్షమాభిక్ష లేదా క్షమాపణ కోసం చేసే ప్రయత్నాలకు సహకరిస్తుందని అన్నారు.
అయితే, నిమిష మరణశిక్ష వాయిదా అనంతరం మృతుడి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బ్లడ్ మనీ ఒప్పందం కోసం తీవ్ర చర్చలు జరిపినప్పటికీ అంగీకారం తెలుపలేదు. నేరానికి క్షమాపణ అంటూ ఉండదని.. చేసిన తప్పుకు నిమిషకు శిక్ష పడాల్సిందేనని.. బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై భారత్, యెమెన్ ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊటీ కొండ రైలులో ప్రయాణానికి పర్యాటకుల ఆసక్తి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‘సూపర్ పోలీస్’ కాదు..
Read Latest Telangana News and National News