National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ట్విస్ట్.. సోనియా, రాహుల్‌పై కొత్త ఎఫ్‌ఐఆర్
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:36 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.
ఢిల్లీ, నవంబర్ 30: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలైన ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సహా మరికొందరిపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా( Young India) సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఆరోపించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతిచెందారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసు విషయానికి వస్తే... నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ (AJL)కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుందని, రాహుల్, సోనియా(Sonia Gandhi)కు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌కి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది.
ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా భారీగా అక్రమార్జనకు(political corruption) పాల్పడ్డారని తెలిపింది. 2025 అక్టోబర్ 3 నాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ రూపొందించబడింది. ఈడీ తమ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులతో పంచుకోవడంతో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఢిల్లీ కోర్టు(Delhi court ) డిసెంబర్ 16కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి