News Papers House: ఆ ఇల్లును... వార్తా పత్రికలతో కట్టుకున్నాడు...
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:09 AM
తన ఆలోచనను ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. వార్తాపత్రికలను ఒకదానిపై ఒకటి అంటిస్తూ మందమైన గోడలను తయారుచేశారు. గోడలు అర అంగుళం మందంతో ఉండేలా చూశారు. ప్రతీ రోజూ మూడు పేపర్లు ఇంటికొచ్చేవి. కొన్నిపేపర్లు స్నేహితులు, బంధువులు తీసుకొచ్చి ఇచ్చారు.
స్టీలు, సిమెంటు, ఇసుక, ఇటుకలతో ఇల్లు కడతారెవరైనా. కానీ ఇవేవీ లేకుండానే... పాత న్యూస్‌పేపర్లతో ఓ ఇంటిని కట్టుకున్నాడు. మరో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే... ఆ ఇల్లు నిర్మించి వందేళ్లయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆ ‘పేపర్‌హౌస్’ ఎక్కడుందంటే...!
అందరిలా ఇల్లు కట్టుకుంటే ప్రత్యేకత ఏముంటుంది? ఈ ఆలోచన వచ్చిన వెంటనే, మొదలు పెట్టిన ఇంటి నిర్మాణాన్ని ఆపారు. ఇటుక, సిమెంటు అవసరం లేకుండా పాత న్యూస్‌పేపర్లతో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలనుకున్నారు అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో నివాసం ఉండే ఎలిస్ స్టెన్‌మన్. ఆయన తన వేసవి విడిది కోసం ఓ ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. మెకానికల్ ఇంజనీర్ అయిన స్టెన్‌మన్ భార్య ఎస్తేర్‌తో కలిసి ఉండేవారు. 1922లో పెనిన్సులా దగ్గరలోని రాక్‌పోర్ట్ సమీపంలో వేసవి విడిది కోసం ఒక ఇంటి నిర్మాణం ప్రారంభించారాయన. సాధారణ ఇళ్ల మాదిరి గానే తన ఇంటిని కలపతో నిర్మించుకోవాలని పనులు ప్రారంభించారు. కానీ కొంత నిర్మాణం చేశాక ‘కొత్తగా చేస్తే బాగుంటుంది కదా’ అనుకున్నారు. పాత వార్తాపత్రికలను పడేసే బదులుగా... వాటిని ఇంటి నిర్మాణంలో వాడొచ్చు కదా అని ఆలోచించారు.

వస్తువులు సైతం...
తన ఆలోచనను ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. వార్తాపత్రికలను ఒకదానిపై ఒకటి అంటిస్తూ మందమైన గోడలను తయారుచేశారు. గోడలు అర అంగుళం మందంతో ఉండేలా చూశారు. ప్రతీ రోజూ మూడు పేపర్లు ఇంటికొచ్చేవి. కొన్నిపేపర్లు స్నేహితులు, బంధువులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంటి నిర్మాణం గురించి తెలిసిన మరికొందరు వాళ్ల ఇళ్లలోని పాత పత్రికలు తెచ్చి ఇచ్చారు. ఇలా మొత్తంగా సుమారు లక్ష వార్తాపత్రికలను ఇంటి కోసం వాడారు. పత్రికలను అతికించడానికి జిగురుగా పిండిని ఉపయోగించారు. పిండి, నీళ్లు, యాపిల్ తొక్కలు ఉపయోగించి ఇంట్లోనే జిగురు తయారుచేయించారు. వెదర్‌ప్రూఫ్‌గా ఉండటం కోసం నాలుగైదు సార్లు వార్నిష్ చేశారు. పైకప్పు మాత్రం చెక్కతో నిర్మించారు. ఆ విధంగా పేపర్‌హౌస్ నిర్మాణం జరిగింది.

ఈ పేపర్‌హౌస్‌లో టేబుల్, కుర్చీలు, లాంతర్లు, డెస్క్, మంచం, బుక్ షెల్ఫ్‌లు, ఫైర్‌ఫ్లేస్ వంటివి ఉన్నాయి. ఆయా వస్తువులన్నీ చుట్టిన న్యూస్‌పేపర్లతో తయారుచేశారు. నీరు, విద్యుత్ సదుపాయం ఉంది. వాష్‌రూమ్ ఇంట్లో కాకుండా బయట ఆవరణంలో నిర్మించారు. మొదటి ప్రపంచయుద్ధానికి సంబంధించిన వార్తలు ఉన్న న్యూస్‌పేపర్లు ఆ ఇంటి గోడల్లో కనిపిస్తుంటాయి. ఇంటిని సందర్శించిన పర్యాటకులు అప్పటి వార్తా కథనాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. స్టెన్‌మన్ చనిపోయాక ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య కాలంలో సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు. ఇంటి ముందు ఉన్న పెట్టెలో రెండు డాలర్లు వేసి పర్యాటకులు ఆ ఇంటిని సందర్శించవచ్చు. వందేళ్లు పూర్తయినా పేపర్‌హౌస్ ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం పర్యాటకులను అమితంగా ఆశ్చర్యానికి గురిచేసే అంశం.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
Read Latest Telangana News and National News