Maharashtra: మంత్రివర్గ పునర్వవస్థీకరణకు కసరత్తు... ఢిల్లీకి సీఎం
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:50 PM
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.

ముంబై: పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం నాడు న్యూఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన కలుసుకున్నారు. వీరితోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అర్బన్ ఎఫైర్స్ మంత్రి మనోహర్ ఖట్టర్, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యంను ఫడ్నవీస్ కలుసుకున్నారు.
మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి-ఎన్డీయేకు ఫడ్నవీస్ నేతృత్వం వహిస్తుండగా.. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, పలువురు క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మందికి ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.
'ఈ గందరగోళాన్ని తొలగించాల్సిన అవసరం ఫడ్నవీస్‌కు ఉంది. మంత్రులు మానిక్ రావు కోకటే, సంజయ్ షిర్సాత్, సంజయ్ రాథోడ్, యోగేష్ కదమ్‌ను మంత్రి పదవుల నుంచి తప్పించడం కానీ శాఖలు మార్చడం కానీ జరగవచ్చు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. బీజేపీ వెటరన్ సుధీర్ ముంగంటివార్‌కు స్పీకర్ పదవి ఇవ్వొచ్చు' అని రౌత్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిణామాల గురించి తమకు తెలియదని ముంగటివార్ తెలిపారు. రాహుల్ నార్వేకర్ స్పందిస్తూ, మంత్రి పదవి కంటే స్పీకర్ పదవే ఎక్కువని అన్నారు. కాగా, రౌత్‌ను పట్టించుకోనవసరం లేదని మంత్రులు యోగేష్ కదమ్, నితీష్ రాణే కొట్టివేశారు. కేంద్ర నాయకత్వం స్థాయిలోనే మంత్రివర్గ పునర్వవస్థీరణ జరుగుతుందని, అదే జరిగితే అందరికీ తెలుస్తుందని ముంగటివార్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి
అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి