Mahabharata Period: బయటపడిన మహాభారతం ఆనవాళ్లు.. 4,500 ఏళ్ల నాగరికత వెలుగులోకి!
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:43 PM
మహాభారత కాలం నాటి ఆనవాళ్లు మరోమారు బయటపడ్డాయి. 4500 ఏళ్ల మన దేశ పురాతన చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభించాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

మహాభారత కాలం నాటి ఆనవాళ్లు మరోమారు బయటపడ్డాయి. రాజస్థాన్ దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తవ్వకాలు చేపట్టింది. 23 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ పరిశోధనల్లో 4500 ఏళ్ల నాటి పురాతన నాగరికతకు సంబంధించిన నమ్మశక్యం కాని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల్లో మహాభారత కాలం నాటి ఆధారాలతో పాటు రుగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతీ నదికి సంబంధించిన ప్రవాహ మార్గం బయటపడటం సంచలనంగా మారింది. దాదాపుగా 6 నెలలుగా ఇక్కడ తవ్వకాలు జరుపుతోంది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.
ఇదే తొలిసారి..
బహాజ్ గ్రామంలో బయటపడిన నదీ ప్రవాహ మార్గం సరస్వతీ నదీ వ్యవస్థలో భాగమై ఉండొచ్చునని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే తొలినాటి మానవ ఆవాసాలు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మధుర, బ్రజ్ ప్రాంతాలతో ఈ నాగరికత సాంస్కృతిక సంబంధాలు కొనసాగించి ఉండొచ్చునని భారత పురావస్తు శాఖ సైట్ హెడ్ పవన్ సారస్వత్ పేర్కొన్నారు. సుమారు 23 మీటర్ల లోతు వరకు జరిపిన తవ్వకాలు రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత లోతైనవిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏకంగా 5 నాగరికతలతో..
బహాజ్ గ్రామంలో జరిపిన తవ్వకాలు యావత్ దేశానికి ప్రాచీన చరిత్ర అధ్యయనానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకే ప్రదేశంలో హరప్పా తర్వాతి కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం.. ఇలా 5 వేర్వేరు చారిత్రక కాలాలకు సంబంధించిన ఆధారాలు బయటపడటం అద్భుతమని అంటున్నారు. పైనాగరికతలన్నీ ఇక్కడ విలసిల్లాలయని చెబుతున్నారు. ఈ తవ్వకాల్లో మహాభారత కాలం నాటి యజ్ఞ కుండాలు, మట్టిపాత్రలు, వాటిపై ఉన్న చిత్రాలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్రాహ్మీ లిపి ముద్రలు, శివపార్వతుల విగ్రహాలతో పాటు ఎముకలతో చేసిన పనిముట్లు, సూదులు, దువ్వెనలు, అచ్చులు, రాగి నాణేలు ఇక్కడి తవ్వకాల్లో బయటపడటం విశేషం.
ఇవీ చదవండి:
మీ టోల్ ఖర్చులను ఇలా తగ్గించుకోండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి