Gold Smuggling Case: రన్యా రావుకు ఈ విషయంలో గత ప్రభుత్వ సహకారం.. KIADB నివేదిక విడుదల..
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:25 PM
Gold Smuggling Case RanyaRao:గత సోమవారం కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోల్డ్ అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారం, నగదు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది రన్యా. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో రన్యారావుకు...

Gold Smuggling Case RanyaRao: బంగారం అక్రమ రవాణా కేసు (Gold Smuggling Case)లో అరెస్టయిన కన్నడ నటుడు హర్షవర్ధిని రన్యా అలియాస్ రన్యా రావు(Ranya Rao)కు గత బీజేపీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించినట్లు తాజాగా అధికారిక నివేదికలు వెల్లడయ్యాయి. ఈ విషయమై కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) ఆదివారం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు విషయమై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అప్రమత్తం చేయడంతో.. ఇప్పటికే రన్యారావుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కూడా కేసు నమోదు చేసింది.
రన్యా కంపెనీకి భూమి కేటాయింపులు..
రన్యా కంపెనీ క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు భూమి కేటాయింపు వివాదాస్పదంగా మారింది.తుమకూరు జిల్లాలో ఉన్న సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో రూ.138 కోట్ల విలువైన ప్రాజెక్టుకు 12 ఎకరాల పారిశ్రామిక భూమిని జనవరి 2, 2023న కంపెనీకి కేటాయించినట్లు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) ఒక ప్రకటనలో తెలిపింది. 2023 మేలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్ష తర్వాతే భూమి మంజూరు..
TMT బార్లు,రాడ్లు, అనుబంధ ఉత్పత్తులు సహా ఉక్కు ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ఈ భూమిని మంజూరు చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టుకు ₹138 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేయబడింది.ఈ ప్రాంతంలో దాదాపు 160 ఉద్యోగాలను సృష్టించగలిగే అవకాశం ఉంది. 137వ రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ (SLSWCC) సమీక్ష తర్వాత దీనికి ఆమోదం లభించింది.రన్యారావుకు భూమి కేటాయింపుపై వస్తున్న వార్తలపై మధ్యతరహా, భారీ పరిశ్రమల మంత్రి MB పాటిల్ కార్యాలయం స్పందించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే భూ కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారని.. ఇది పూర్తిగా వ్యాపార నిర్ణయం అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వ ఆమోదం లభించడంలో ఎటువంటి వ్యక్తిగత సంబంధాల ప్రభావం లేదని KIADB నొక్కి చెప్పింది.
ఏడాదిలో 30 సార్లు దుబాయ్..
అధికారిక సమాచారం ప్రకారం, రన్యా ఏడాది 30 సార్లు గోల్డ్ అక్రమ రవాణా కోసం దుబాయ్ వెళ్ళారు.ఒక కిలో బంగారాన్ని స్మగ్లింగ్ రవాణా చేస్తే ఆమెకు లక్ష రూపాయలు వచ్చేవి. గత 15 రోజుల్లోనే ఆమె నాలుగుసార్లు దుబాయ్ సందర్శించింది. దుబాయ్‌కి ఒకసారి వెళ్తే దాదాపు 13 లక్షలు సంపాదించేదని తెలుస్తోంది.స్మగ్లింగ్ కోసం మోడిఫైడ్ జాకెట్లు, ప్రత్యేక బెల్టులను ధరించేదని అధికారులు చెబుతున్నారు. ఇదివరకే లావెల్లె రోడ్డులోని రన్యా ఇంట్లో డీఆర్‌ఐ బృందం సోదాలు చేసింది. ఈ ఇంట్లో ఆమె తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఇదిలా ఉంటే రన్యారావు డీజీపీ ర్యాంకు అధికారి రామచంద్రరావు కూతురు. రామచంద్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
భూ కేటాయింపు, రన్యా అరెస్టుపై అధికారం దుర్వినియోగంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక భూ కేటాయింపు ప్రక్రియలలో విస్తృత పరిశీలన చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం అక్రమ రవాణా కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు నడిపిస్తున్న పెద్ద సిండికేట్‌ను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Read Also : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..
Tamil Nadu: డీలిమిటేషన్, నిర్బంధ హిందీ అమలుపై కేంద్రాన్ని నిలదీయాలి
Turtle Nesting: ఒడిశా ఏకాకులానాసి దీవిలో ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..